
ఇంటి నంబర్ల దందాపై బల్దియా నజర్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధి లో ఇంటినంబర్ల దందాపై అధికారులు దృష్టి సారించారు. ఏళ్లకాలంగా ఇంటినంబర్లతో ఖాళీ స్థలాలను కబ్జాచేస్తున్న వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రేకుర్తిలో ఎలాంటి నిర్మాణాలు లేని స్థలాలకు ఇచ్చిన ఇంటినంబర్లను రద్దు చేయగా, ఇటీవల బొమ్మకల్‌లోనూ ఇలాంటి ఇంటినంబర్లను రద్దు చేశారు. నగరంలోని డివిజన్ల వారీగా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లను గుర్తించేందుకు విచారణ చేపట్టా రు. నివేదిక వచ్చాక చర్యలు చేపట్టనున్నారు.
ఇంటి నంబర్లతో ఆక్రమణ
నగరంలో ఇంటి నంబర్లతో భూముల కబ్జాలకు పాల్పడే దందా ఏళ్లుగా సాగుతోంది. కొంతమంది నగరపాలకసంస్థ రెవెన్యూ అధికారుల కుమ్మక్కుతో కబ్జారాయుళ్ల ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ భూములు, వివా దాస్పద భూములే లక్ష్యంగా ఇంటి నంబర్లను ప్రయోగిస్తున్నారు. ఎంచుకున్న ఖాళీ స్థలంలో నిర్మాణాలు లేకున్నా, ఇంటి నంబర్‌ను జారీ చేస్తున్నారు. ఈ ఇంటి నంబర్ ఆధారంగా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆక్రమించుకొంటున్నారు. ఇలా ఇంటి నంబర్లతో భూముల ఆక్రమణపై అనేక ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఉన్నతాధికారులు నియంత్రణపై దృష్టి సారించారు.
రేకుర్తి, బొమ్మకల్‌లో రద్దు
వివాదాస్పద భూములకు అడ్డాగా ఉన్న రేకుర్తి, బొమ్మకల్‌లో పలు ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు గతంలో విచారణచేపట్టారు. రేకుర్తిలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీ స్థలాలకు ఇచ్చిన 1002 ఇంటి నంబర్లను రద్దు చేశారు. బొమ్మకల్‌లోనూ విచారణ చేపట్టిన అనంతరం ఇప్పటివరకు దాదాపు 18 ఇంటి నంబర్లను రద్దు చేశారు.
డివిజన్లవారీగా సేకరణ
రేకుర్తి, బొమ్మకల్‌తో పాటు నగరంలోని అన్ని డివిజన్లలోనూ ఇలాంటి ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ అయిన వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశాలతో వార్డు అధికారులు, నిర్మాణాలు లేని స్థలాలకు జారీ అయిన ఇంటినంబర్ల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూముల వారిగా జాబితా సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో విచారణ నివేదిక వచ్చిన తరువాత ఆ ఇంటినంబర్లను రద్దు చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకొనే అవకాశముంది.