ఏం చేద్దాం.. ఎలా చేద్దాం? | - | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?

Sep 10 2025 3:41 AM | Updated on Sep 10 2025 3:41 AM

ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?

ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?

‘మల్టీ పార్టీస్‌ పార్క్‌’పై మల్లగుల్లాలు

మొదట రూ.25 వేలు జరిమానా

లీజు ఉల్లంఘనలపై బల్దియా కమిటీ

తప్పని తేలితే ఒప్పందం రద్దు

అధికారుల తీరుపై కాంగ్రెస్‌ గుస్సా

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

నిబంధనలకు విరుద్ధంగా దందా సాగిస్తున్న మల్టీపర్పస్‌ పార్క్‌ కాంట్రాక్ట్‌ ఏజెన్సీపై చర్యకు బల్దియా కసరత్తు చేస్తోంది. మల్టీపర్పస్‌ పార్క్‌ కాస్తా మల్టీ పార్టీస్‌ పార్క్‌గా మారడంతో షరామామూలుగానే అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. పార్క్‌లో లీజు పేరిట కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సాగిస్తున్న దందాలపై ‘ఇదేం గలీజు దందా’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించడం తెలిసిందే. లీజు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను మీరి చేపడుతున్న దందాలపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండగా, చర్యలు తీసుకోకపోవడంతో అధికార కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

రద్దా.. కొనసాగింపా?

నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసిన మల్టీపర్పస్‌ పార్క్‌ కొంతమంది వ్యాపారాలకు కేంద్రంగా మారింది. రెండేళ్ల నిర్వహణ పేరిట టెండర్‌ దక్కించుకున్న సదరు కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం సమస్యగా మారింది. లీజు ఒప్పందానికి విరుద్ధంగా ప్రవేశ రుసుం రూ.20 నుంచి రూ.50కి పెంచడం, వాహనాల పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయడం, వాకింగ్‌ ట్రాక్‌ను దుర్వినియోగం చేయడం, మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడడంతో పాటు ఇప్పుడు ఏకంగా దాబా హోటల్‌ను ప్రారంభించారు.

ఐదు వేల మొక్కలు నాటారట

పార్క్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తుండడాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏజెన్సీ నిర్వాహకులు ఐదు వేల మొక్కలు నాటామంటూ కొత్త రాగం ఎంచుకొన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్క్‌లో తాము ఐదు వేల మొక్కలు నాటామంటూ నమ్మబలుకుతున్నారు. అసలు ఐదు వేల మొక్కలు నాటే స్థలం ఆ పార్క్‌లో ఎక్కడుందో అని నిత్యం వాకింగ్‌కు వచ్చే వాకర్స్‌ వెతికే పనిలోపడ్డారు. పైగా మొక్కలు నాటేందుకు, ఇతరత్రా రూ.50 లక్షలు ఖర్చు చేశామని బల్దియాకు రాసిన లేఖనే వాళ్ల మెడకు ఇప్పుడు చుట్టుకొనే పరిస్థితి ఏర్పడింది.

రూ.25 వేలు జరిమానా

అనుమతి లేకుండా దాబా హోటల్‌ను ప్రారంభించిన రాక్‌ ఏజెన్సీకి బల్దియా నోటీసు జారీ చేస్తూ, రూ.25 వేలు జరిమానా విధించింది. పార్క్‌లో లీజు ఒప్పందం ఉల్లంఘనలపై డిప్యూటీ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. నివేదికలో ఉల్లంఘనలు నిజమే అని తేలితే మొత్తం లీజు ఒప్పందాన్ని రద్దు చేయనుంది. బుధవారం తుది నోటీసు జారీ చేసే అవకాశముంది.

గ‘లీజ్‌’ దందా పార్ట్‌–2

నిబంధనలు పక్కనపెట్టి, పార్క్‌ గోడను తొలగించి దాబా ప్రారంభించిన ఏజెన్సీ నిర్వాహకులు సరికొత్త వాదనను తెరమీదికి తీసుకొచ్చారు. దాబా ప్రారంభంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తమకు క్యాంటీన్‌కు అనుమతి ఉందని, అందుకే దాబా ప్రారంభించామంటున్నారు. క్యాంటీన్‌కు, దాబాకు తేడా లేదని వాదనకు దిగుతున్నారు. క్యాంటీన్‌ అంటే కేవలం ప్యాకేజ్డ్‌ ఆహారపదార్థాలు మాత్రమే ఉంటాయి. దాబా హోటల్‌కు ప్రత్యేకంగా బట్టిని ఏర్పాటు చేయడంతో పాటు, వంటకాలు ఇక్కడే చేస్తారు. తద్వారా నిర్వాహకులు చెప్పుకొంటున్నట్లుగా ‘ఆక్సీజన్‌ జోన్‌’ పార్క్‌ కాస్తా ‘పొల్యూషన్‌ పాయింట్‌’గా మారుతోంది.

చర్యలు తీసుకోవాల్సిందే: వెలిచాల

మల్టీపర్పస్‌ పార్క్‌లో లీజు ఒప్పంద నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు డిమాండ్‌ చేశారు. అనుమతి లేకుండా దాబాను ప్రారంభించడంపై ఆయన నగరపాలకసంస్థ అధికారులకు ఫోన్‌ చేశారు. చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకపోతే తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement