
ఎంవోయూతో మరిన్ని సేవలు
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎంవోయూలు కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరిన్ని సేవలు అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి (హవేలి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జేఈఈ, ఐఐటీ, నీట్ కోర్సు పుస్తకాలను ‘ట్రస్మా’ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు అందించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ విద్యార్థులకు విభిన్న రంగాల్లో విజయవంతంగా శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదవడం, రాయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు ప్రతినెలా రీడింగ్, రైటింగ్ పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కొత్తపల్లి పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని, ఇక్కడి విద్యార్థులు విభిన్న రంగాల్లో ఎంపికవుతుండటం సంతోషదాయకమన్నారు. అనంతరం విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు నిర్వహిస్తున్న విటమిన్ గార్డెన్‌ను పరిశీలించారు. భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఎంఈవో తుమ్మ ఆనందం, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, హెచ్‌ఎం కన్నం రమేశ్ పాల్గొన్నారు.