2,206 విగ్రహాలు నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

2,206 విగ్రహాలు నిమజ్జనం

Sep 7 2025 7:54 AM | Updated on Sep 7 2025 7:54 AM

2,206

2,206 విగ్రహాలు నిమజ్జనం

● శనివారం సాయంత్రం వరకు కొనసాగిన కార్యక్రమం ● నేటి నుంచి శిథిలాల తొలగింపు ● రూ.2.92 లక్షలతో ఇప్పటికే టెండర్‌

నగరపరిధిలోని వివిధ చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేసిన విగ్రహాలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌ కల్చరల్‌/కొత్తపల్లి/కరీంనగర్‌ టౌన్‌/ మానకొండూర్‌: వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ప్రారంభమై శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో మానకొండూరు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్‌ వద్ద నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,206 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. వీటితో పాటు దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌, బొమ్మకల్‌లోని చెరువులు, వాగుల్లోనూ నిమజ్జనం చేశారు. విగ్రహాల శిథిలాల తొలగింపును ఆదివారం నుంచి చేపట్టనున్నారు. ప్రతిసారి నిమజ్జనం అనంతరం ఆయా చెరువులు, కాలువల్లో విగ్రహ శిథిలాలు రోజుల తరబడి పేరుకుపోవడం, స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈసారి ముందుగానే శిథిలాల తొలగించడానికి నగరపాలకసంస్థ రంగం సిద్ధం చేసింది. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా విగ్రహ శిథిలాల తొలగింపునూ టెండర్‌లో చేర్చింది. మానకొండూరు చెరువు నుంచి విగ్రహాలు, శిథిలాలు తొలగించడానికి రూ.98 వేలు, కొత్తపల్లి చెరువు నుంచి తొలగించేందుకు రూ.95 వేలు,చింతకుంట కెనాల్‌ నుంచి తొలగించేందుకు రూ.99 వేలు కేటా యించారు. ఆదివారం నుంచి శిథిలాల తొలగింపును ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సాయంత్రం వరకు కొనసాగిన నిమజ్జనం

మానకొండూర్‌, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనా ల్‌లో శనివారం సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. మానకొండూర్‌ చెరువుకు వేకువజాము వరకు భారీ విగ్రహాలు తరలివచ్చా యి. 844 పెద్దవి, 174 చిన్న విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌ రాంనగర్‌లోని మిత్ర యూత్‌ క్లబ్‌ భారీ గణేశుడిని చింతకుంట కెనాల్‌లో నిమజ్జనం చేయడంతో వేడుకలు సంపూర్ణంగా ముగిశాయి. కొత్తపల్లి చెరువులో 535 విగ్రహాలు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్‌ వద్ద 488 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిమజ్జన వేడుకలు విజయవంతంగా ముగిశాయని నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ తెలిపారు. శనివారం కొత్తపల్లి చెరువు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్‌ను పరిశీలించారు.

భారీ గణేశుడి శోభాయాత్రకు అడ్డంకులు

కరీంనగర్‌లోని రాంనగర్‌లో మిత్ర యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35అడుగుల భారీ మట్టి వినాయకుడి శోభాయాత్రకు విద్యుత్‌ తీగలు, సీసీ సర్వేలెన్స్‌ కెమెరాల స్తంభాలు అడ్డంకిగా మారాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచే రాంనగర్‌ చౌరస్తాలో శోభాయాత్ర నిలిచిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆదేశాలతో మేరకు మాజీ మేయర్‌ వై.సునీల్‌రావు విద్యుత్‌శాఖ, నగరపాలక సంస్థ కమిషనర్‌తో మాట్లాడారు. అడ్డుగా ఉన్న విద్యుత్‌ తీగలు, కెమెరా స్తంభాలను తొలగించి శోభయాత్రకు మార్గం సుగమం చేయడంతో గణేశుడు చింతకుంటకు నిమజ్జనానికి తరలాడు.

కలెక్టర్‌, కమిషనర్లకు అభినందనలు

కరీంనగర్‌లో గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్‌ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ ఆలం, మున్సిపల్‌ కమి షనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ సహా అన్నిశాఖల అధికారులను ఒక ప్రకటనలో ప్రత్యేకంగా అభినందించారు.

మానకొండూర్‌ 1,018

కొత్తపల్లి 535

చింతకుంట 488

దుర్శేడ్‌ 78

బొమ్మకల్‌ 48

గోపాల్‌పూర్‌ 39

మొత్తం 2,206

2,206 విగ్రహాలు నిమజ్జనం1
1/2

2,206 విగ్రహాలు నిమజ్జనం

2,206 విగ్రహాలు నిమజ్జనం2
2/2

2,206 విగ్రహాలు నిమజ్జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement