తీరని యూరియా కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తీరని యూరియా కష్టాలు

Sep 7 2025 7:54 AM | Updated on Sep 7 2025 7:54 AM

తీరని

తీరని యూరియా కష్టాలు

కాల్వశ్రీరాంపూర్‌/సుల్తానాబాద్‌/ఎలిగేడు(పెద్దపల్లి): యూరియా కోసం అన్నదాతలు అన్నిపనులూ వదిలేసి మండల కేంద్రాలు, పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. వరి, పత్తి తదితర పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతోఅవసరమని, అదను దాటితే ఎంతవేసినా ప్రయోజనం ఉండదనే ఆతృతతో అన్నదాతలు వేకువజాము నుంచే దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. వచ్చే ఒకట్రెండు లోడ్‌లో వరుసలో ముందున్న వారికే సరిపోవడం లేదని, వెనుకాల ఉన్నవారి వంతు వచ్చేవరయే స్టాక్‌ ఖాళీ అవుతోందని రైతులు వాపోతున్నారు. శనివారం కూడా జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఉదయమే సింగిల్‌విండోలు, దుకాణాలు, గ్రోమోర్‌ తదితర గోదాముల ఎదుట బారులు తీరి కనిపించారు.

పోలీస్‌ బందోబస్తు మధ్య పంపిణీ

సుల్తానాబాద్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందనే సమాచారంతో పలు గ్రామాల రైతులు ఉదయమే గోదాము వద్దకు చేరుకుని బారులు తీరారు. లారీలోడ్‌లో 340 బస్తాల యూరియా రావడంతో పట్టాదారుపాస్‌ పుస్తకాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఒక్కో రైతుకు ఒకట్రెండు యూరియా బ్యాగులు అందజేశారు. రైతుల సంఖ్య అధికంగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై శ్రవణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. మిగతా వారికి సోమవారం యూరియా స్టాక్‌ వస్తుందని చెప్పి పంపించి వేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పీఏసీఎస్‌ కార్యదర్శి సంతోష్‌కుమార్‌, ఇన్‌చార్జి చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌ తెలిపారు.

క్యూలైన్‌లో చెప్పులు.. రైతుల పాట్లు

కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లిలోని ఆగ్రోస్‌ కేంద్రం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. అదేవిధంగా ఇదేగ్రామంలోని సాయికృష్ణ ఫెర్టిలైజర్స్‌ దుకాణం ఎదుట కూడా వందల సంఖ్యలో క్యూలో నిల్చున్నారు. యూరియా స్టాక్‌ రాక ఆలస్యం కావడంతో తమవంతు లైన్‌లో చెప్పులు ఉంచారు. రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పాస్‌బుక్కు జిరాక్స్‌ ఆధారంగా ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా, నానో లిక్విడ్‌ బాటిల్‌ ఇస్తున్నారు. పొద్దంతా పడిగాపులు కాస్తే.. ఒకబస్తా సైతం అందలేని, వరి పొట్టదశకు వచ్చిందని, పత్తి పూతపూసి గుంజర వచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఈ సమయంలో యూరియా వేయాల్సి ఉన్నా.. దొరకడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తీరని యూరియా కష్టాలు

ఎలిగేడు మండలం ధూళికట్ట సహకార సంఘానికి యూరియా లోడ్‌ వచ్చిందనే సమాచారంతో ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు ఉదయమే తరలివచ్చారు. క్యూలైన్‌లో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో పంపిణీని కాసేపే ఆపివేసారు. సాయంత్రం 5గంటలకు పోలీసులు రావడంతో పంపిణీని మళ్లీ ప్రారంభించారు. ధూళికట్టలో ఎకరాకు ఒకబస్తా చొప్పున 340 బస్తాలు, ఎలిగేడులో టోకెన్‌కు రెండు బస్తాల చొప్పున 540 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏవో ఉమాపతి తెలిపారు. ఏఈవో శరణ్య పాల్గొన్నారు.

మూడు రోజులు బారులు తీరినా..

వీర్నపల్లి: మండల కేంద్రంలో మూడురోజులుగా రైతులు బారులు తీరుతున్నా యూరియా లభించ డం లేదు. శనివారం ఉదయం నుంచి రైతువేదికకు 220 యూరియా బస్తాలు రాగా.. క్యూలో నిలబడితే.. ఒకేఒక్క యూరియా బస్తా ఇవ్వడంతో ఇవేమీ కష్టాలని రైతులు ఆవేదన చెందారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆవేదన చెందారు.

టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు..

చందుర్తి: విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశాలకు మేరకు శనివారం 330 యూరియా బస్తాలను సరఫరా చేశారు. సమాచారం అందుకున్న రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. 156 మంది రైతులకు రెండు బస్తాల చొప్పన సిబ్బంది పంపిణీ చేశారు. సగం మందికి కూడా సరిపడా యూరియా అందలేదు. దీంతోవారు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రైతులకు వ్యవసాయాధికారులు టోకెన్లు ఇచ్చారు. మరోలోడ్‌ వచ్చేక ప్రాధాన్యత ప్రకారం యూరియా అందిస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.

గూడెంలో రైతుల జాగరణ

ఓదెల(పెద్దపల్లి): గూడెం గ్రామంలో రైతులు యూరియా కోసం జాగరణ చేశారు. రాత్రి సమయంలో 140 బస్తాల యూరియా లోడ్‌ రాగా.. 400 మంది దాకా రైతులు గుమిగూడారు. తమకు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఎస్సై రమేశ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బ్యాగ్‌ పంపిణీ చేయడంతో ఆందోళన విరమించారు.

దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు

అయినా, అందరికీ సరిపడా అందని బ్యాగులు

నిరాశతో వెనుదిరుగుతున్న అన్నదాతలు

అదను దాటిపోతుందనే ఆందోళనలో రైతులు

తీరని యూరియా కష్టాలు 1
1/2

తీరని యూరియా కష్టాలు

తీరని యూరియా కష్టాలు 2
2/2

తీరని యూరియా కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement