
పింఛన్లు పెంచకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం
మానకొండూర్/గంగాధర: ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 21నెలలుగా ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా మండిపడ్డారు. మానకొండూర్, గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో శుక్రవారం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులతో సమావేశం అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో నెల రోజుల్లో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రశ్నించాల్సి ఉండగా, ప్రజల్లోకి రాకుండా గడీలకే పరిమితం అయ్యారన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టిన రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌కు పేదల బాధలు తెలియవని, తాను కడు పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల బాధలు తెలుసన్నారు. ప్రభుత్వం పింఛన్లు పెంచాలని ఈ నెల 8న కలెక్టరేట్లు, 12న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామన్నారు. 20వ తేదీన విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారి బంద్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. 21 నుంచి 26వరకు గ్రామ పంచాయతీల ఎదుట దీక్షలు చేపడతామన్నారు. వీహెచ్‌పీఎస్ నాయకులు గోపాల్, అనవేని కౌసల్య, జిల్లా ఇన్‌చార్జి మంద రాజు, మానకొండూర్ మండల ఇన్‌చార్జి కనకం అంజిబాబు, రాష్ట్ర నాయకుడు చిలుము ల రాజయ్య, ఎమ్మార్పీఎస్ గంగాధర మండలాధ్యక్షుడు గంగాధర రవి, జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ పాల్గొన్నారు.
ఉత్తమ అవార్డులు అందుకున్న అధ్యాపకులు
కరీంనగర్‌క్రైం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణి, శాసనమండలి సభ్యుడు పి.శ్రీపాల్‌రెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ ఉమేశ్‌కుమార్ చేతుల మీదుగా ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా శ్రీవాణి, కాంపల్లి అర్జున్ అవార్డులు స్వీకరించారు. వీరిని వీసీ రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, హరికాంత్, సూరేపల్లి సుజాత, ఎస్సారార్ ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ అభినందించారు.
పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దండి
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని డీఈవో చైతన్య జైనీ సూచించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారిని సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సత్కరించారు. ముఖ్య అతిథిగా డీఈవో చైతన్యజైనీ హాజరై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే ఉందన్నారు. విద్యాశాఖలో ఎన్ని రకాల అధికారులు ఉన్నా.. ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకే ఉంటుందన్నారు. జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి భగవంతయ్య మాట్లాడుతూ నూతన ప్రధానోపాధ్యాయులు సేవాభావంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సంఘం జిల్లాశాఖ అధ్యక్షుడు నలుమాచు సుదర్శనం, సర్వ శిక్ష అభియాన్ కోఆర్డినేటర్లు కర్ర అశోక్‌రెడ్డి, ఆంజనేయులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాపల్లి శ్రీనివాస్, కోశాధికారి అనురాధ పాల్గొన్నారు.
రేపు ఇల్లందకుంట రామాలయం మూసివేత
ఇల్లందకుంట: జిల్లాలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ నెల 7న ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు కార్యనిర్వాహణాధికారి సుధాకర్ తెలిపారు. 7న మధ్యాహ్నం 12గంటల నుంచి మూసివేయనున్నారు. 8న సోమవారం మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి యథావిధిగా అభిషేకాలు, ఆర్జిత సేవలు కొనసాగుతాయని ఈవో పేర్కొన్నారు.

పింఛన్లు పెంచకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం