
వినాయకా.. వీడ్కోలిక
అట్టహాసంగా సాగిన గణేశుడి శోభాయాత్ర
ఆటపాటలతో యువత సందడి
కిక్కిరిసిన టవర్ సర్కిల్ ప్రాంతం
మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంటలో ప్రశాంతంగా నిమజ్జనం
కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌క్రైం/విద్యానగర్/ కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి/మానకొండూర్: డప్పు చప్పుళ్లు.. భక్తి గీతాలు.. మహిళల కోలాట నృత్యాలు.. ఒగ్గుడోలు విన్యాసాలతో భక్తజనం వెంట నడవగా.. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర కరీంనగరంలో కన్నుల పండువగా సాగింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వేకువజామున వరకు నగరం సందడిగా మారింది. గణపతి బొప్పా మోరియా, జై బోలో గణేశ్ మహారాజ్‌కీ నినాదాలతో మార్మోగింది. ప్రతీ గణనాథుడు శోభాయాత్రగా టవర్‌సర్కిల్, కమాన్ చౌరస్తా, రాంనగర్‌కు చేరుకోగానే గణేశ్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, నగర కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి విగ్రహాలను మానకొండూర్, కొత్తపల్లి చెరువులు, చింతకుంట కెనాల్‌కు శోభాయాత్రగా తరలించి నిమజ్జనం చేశారు. శనివారం వేకువజామున వర కూ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. టవర్‌సర్కిల్ వద్ద గోగుల ప్రసాద్ ఈవెంట్ ఆధ్వర్యంలో సంగెం రాధాకృష్ణ బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాగా.. గణేశ్ నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సీపీ గౌస్‌ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి నిమజ్జన ప్రాంతాలైన కొత్తపల్లి, మానకొండూరు చెరువులను, చింతకుంట కెనాల్‌ను సందర్శించారు. క్రేన్‌సాయంతో కొన్ని విగ్రహాలను స్వయంగా నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి 867 మంది పోలీసతో బందోబస్తు నిర్వహించామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 350మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, 100 మంది హోంగార్డులు, 150 మంది ఎన్‌సీసీ కెడెట్లు, 200మంది వలంటీర్లు విధుల్లో ఉన్నారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంత వాతావారణంలో వినాయ క నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ వివరించారు.

వినాయకా.. వీడ్కోలిక