
రాత్రనకా.. పగలనకా..
చెర్లభూత్కూర్ గోదాం వద్ద రైతుల తోపులాట
చిగురుమామిడిలో యూరియా కోసం రాత్రిపూట వరుసలో రైతులు
కరీంనగర్‌రూరల్/హుజూరాబాద్/చిగురుమామిడి/శంకరపట్నం/రామడుగు: జిల్లాలో పగలనకా.. రాత్రనకా.. పండుగనకా.. పబ్బమనకా.. యూరి యా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా బస్తాల కోసం వాగ్వాదానికి దిగుతున్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ ఎరువుల గోదాంకు శుక్రవారం 400 యూరియా బస్తాలు వచ్చాయి. ఎఈవో స్వర్ణలత రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకుని టోకెన్లను జారీ చేశారు. క్యూలో ఉన్న రైతులు యూరియా కోసం ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. ఒకేసారి రైతులందరూ గోదాంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో అధికారులు యూరియా పంపిణీ నిలిపివేశారు. 160 మందికి టోకెన్లు జారీ చేయగా 70బస్తాలు పంపిణి చేశామని సీఈవో రమేశ్ తెలిపారు. దుర్శేడ్ సహకార సంఘంలో 380 యూరియా బస్తాలకు 146 బస్తాలను పంపిణీ చేశామని సీఈవో వేణుమాధవ్ తెలిపారు. నగునూరులోని ఆగ్రోస్‌లో 120 యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు ఏవో సత్యం తెలిపారు. దుర్శేడ్, చెర్లభూత్కూర్‌లో మిగిలిన బస్తాలను శనివారం పంపిణీ చేస్తామన్నారు. హుజూరాబాద్ సింగిల్ విండో ఎదుట శుక్రవారం వేకువజామున నుంచే బారులు తీరారు. అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు అందించారు. చిగురుమామిడిలోని రైతుడిపోకు శుక్రవారం సాయంత్రం వరకు లారీ యూరియా వచ్చింది. చీకట్లోనూ క్యూలో నిల్చున్న రైతులు యూరియా తీసుకుని వెళ్లారు. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో యూరియా కోసం రైతులు తోపులాడుకున్నారు. మహిళలు సైతం ఇంటి పనులు పక్కనపెట్టి క్యూలో ఉన్నారు. కన్నాపూర్, కాచాపూర్‌లో పోలీసుల పహారాలో పంపిణీ చేశా రు. రామడుగు మండలం వెదిర సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరగా.. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు.

రాత్రనకా.. పగలనకా..