
నిమజ్జనానికి వేళాయె
దారి మళ్లింపు ఇలా..
రూట్ మ్యాప్ ఇలా..
నేడు గంగమ్మ చెంతకు గణపయ్య
మానకొండూర్, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ వద్ద అంతా సిద్ధం
పాయింట్ల వారీగా బల్దియా అధికారులకు బాధ్యతలు
కరీంనగర్‌క్రైం/కరీంనగర్ కార్పొరేషన్/విద్యానగర్/కొత్తపల్లి/మానకొండూర్: జిల్లావ్యాప్తంగా నేటి వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నగరానికి చెందిన విగ్రహాలు మానకొండూర్, కొత్తపల్లి చెరువులతో పాటు చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, భక్తిశ్రద్ధలతో శోభయా త్ర నిర్వహించేందుకు కరీంనగర్ ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్, హిందూ ఉత్స వ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన తరువాత గణనాథులు నిమజ్జనానికి తరలనున్నాయి. సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతో పాటు మరో 650మంది పోలీ సు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉండనున్నారు.
ఏర్పాట్లు పూర్తి.. ఇన్‌చార్జి బాధ్యతలు
నిమజ్జనోత్సవానికి మానకొండూర్, కొత్తపల్లి చెరు వు, చింతకుంట ఎస్సారెస్పీ కాలువ వద్ద క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. టవర్‌సర్కిల్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో స్వాగ త వేదికలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు బల్దియా సిబ్బందికి బాధ్యతలు కేటాయించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక బ్యాచ్, రాత్రి 8 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు మరో బ్యాచ్ ఆయా పాయింట్ల వద్ద విధులు నిర్వర్తిస్తారు. చింతకుంట కెనాల్ వద్ద డీఈ శ్రీనివాస్, ఏఈ సల్మాన్, శానిటరీ సూపర్‌వైజర్ అనిల్‌కుమార్, మానకొండూరు వద్ద శానిటరీ సూపర్‌వైజర్ శ్యాంరాజ్, పర్యావరణ ఇంజినీర్ స్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సంతోష్, కొత్తపల్లి వద్ద ఎంహెచ్‌వో సుమన్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ భీంవర్ధన్‌రెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు. టవర్‌సర్కిల్, రాంనగర్, చింతకుంట, కొత్తపల్లికి పశువైద్యాధికారి దుర్గాప్రసాద్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీఈ అరుణ్‌కుమార్, ఏఈ అయూబ్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్‌కు డీఈ దేవేందర్, ఏఈ గట్టుస్వామిలను ఇన్‌చార్జీలుగా నియమించారు.
హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు మానకొండూర్ బస్టాండ్ నుంచి ముంజంపల్లి, పోరండ్ల వైపు మళ్లిస్తారు. తిమ్మాపూర్ రాజీవ్ రహదారి మీదుగా కరీంనగర్ వెళ్లొచ్చు. కరీంనగర్ నుంచి హుజూరా బాద్ వైపు వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు లేదు. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు వెలిచాల ఎక్స్‌రోడ్డు, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్ ఎక్స్‌రోడ్డు, ఎన్టీఆ ర్ విగ్రహం మీదుగా నగరంలోకి వెళ్లొచ్చు. 5తేదీ నుంచి 6వ తేదీ వరకు గ్రానైట్, ఇతర భారీవాహనాలను సిటీలోకి అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు.
నగరంలోని గాంధీచౌక్ నుంచి రాజీవ్‌చౌక్, క్లాక్ టవర్, కమాన్, అల్గునూర్ మీదుగా మానకొండూర్‌కు గణనాథులు వెళ్తాయి. తెలంగాణ చౌక్ నుంచి వచ్చేవి బస్టాండ్, సీఎస్‌ఐ చర్చి, అమరవీరుల స్తూపం, రాజీవ్‌చౌక్, క్లాక్ టవర్, కమాన్, అల్గునూర్ మీదుగా మానకొండూర్ చేరుకుంటా యి. హౌజింగ్‌బోర్డు కాలనీ, కాపువాడ, మంగళి వాడ, మారుతినగర్, అశోక్‌నగర్ నుంచి వచ్చే ప్రతిమలు బోట్‌చౌరస్తా, మారుతినగర్ చౌరస్తా, పాతబజార్, రాజీవ్‌చౌక్, క్లాక్‌టవర్, కమాన్, అల్గునూర్ నుంచి నిమజ్జనానికి వెళ్తాయి. గోదాం గడ్డ నుంచి ఉమెన్స్ కళాశాల, టూటౌన్‌చౌరస్తా, మంకమ్మతోట, రాంనగర్, పద్మనగర్ మీదుగా చింతకుంట కెనాల్‌కు చేరుకుటాయి. జ్యోతినగర్ నుంచి సెయింట్ జాన్స్ స్కూల్, కొత్తపల్లి పీఎస్, చింతకుంట కెనాల్‌కు వెళ్తాయి. అపోలోరీచ్ హాస్పిటల్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, చైతన్యపురి, ఎస్సారార్ కళాశాల మీదుగా కొత్తపల్లి చెరువుకు వెళ్తాయి. శివ థియేటర్ చౌరస్తా మీదుగా వచ్చేవి సెయింట్ జాన్స్ స్కూల్, శాతవాహన యూనివర్సిటీ, విజయపురికాలనీ, రేకుర్తి, కొత్తపల్లి చెరువుకు చేరుకుంటాయి.