
రోడ్డెక్కిన కాంగ్రెస్ వర్గపోరు
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు రోడ్డెక్కింది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల రాజేందర్‌రావు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో లేదంటూ గొడవ మొదలైంది. ప్రోటోకాల్ ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల రాజేందర్‌రావుపై చర్యతీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాలు నగరంలోని తెలంగాణచౌక్‌లో రాస్తారోకో చేశాయి. డీసీసీ,పీసీసీ అధ్యక్షుడి చిత్రపటాలను పాలతో అభిషేకించాయి. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాదాసి ప్రభాకర్, మాదిగ విద్యార్థి నాయకుడు మాతంగి రమేశ్ మాట్లాడుతూ పీసీసీ, డీసీసీ అధ్యక్షుల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. దళితుడనే కవ్వంపల్లి ఫొటోలు ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
దళితుల ఆత్మబంధువు ‘వెలిచాల’
దళితుల ఆత్మబంధువు వెలిచాల రాజేందర్‌రావుపై నిందలు వేయడం సరికాదంటూ ఆయన అభిమానులు పేర్కొన్నారు. నగరంలోని తెలంగాణచౌక్‌లో రాజేందర్‌రావు ఫ్లెక్సీని పాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్‌రావు యువసేన అధ్యక్షుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మచ్చలేని నేతపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అంటే ఎంతో గౌరవం ఉందని, ఆ ఫ్లెక్సీల ఏర్పాటుతో రాజేందర్‌రావుకు సంబంధం లేదన్నారు.

రోడ్డెక్కిన కాంగ్రెస్ వర్గపోరు