
రహదారి పనులు వేగవంతం చేయండి
కరీంనగర్ అర్బన్/రామడుగు: కొత్తపల్లి– హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సదరు రహదారి పనుల ప్రగతిపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. నాలుగు వరుసల రహదారి కోసం ఇప్పటికే మార్కింగ్ పూర్తయినందున ఎలక్ట్రికల్ వర్క్స్, బావుల పూడ్చివేత, చెట్లు తొలగించే పనులు వేగవంతం చేయాలని అన్నారు. గ్రామాల మీదుగా వెళ్తున్న రహదారి నిర్మాణం కోసం గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహచారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెలకువలతో విద్యాబోధన చేయాలి
ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం దేశరాజ్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, పల్లె దవాఖానాను గురువారం తనిఖీ చేశారు. ఏడోతరగతిలో మ్యాఽథ్స్ పాఠం వింటున్న విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పెద్దగదిలోకి మార్చాలని సూచించారు. పల్లె దవాఖానాను తనిఖీ చేసి వైద్య పరీక్షలు చేసుకుంటున్న రోగులను సేవలను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో రాజేశ్వరీ పాల్గొన్నారు.