
యూరియా తిప్పలు.. రైతుల ఆందోళనలు
హుజూరాబాద్/చొప్పదండి/శంకరపట్నం: జిల్లాలో యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం బుధవారం హుజూరాబాద్ వ్యవసాధికారి కార్యాలయం ఎదుట రైతులు నిరసనకు దిగారు. ఏవో భూమిరెడ్డిని అడ్డుకుని, యూరియా ఏదని నిలదీశారు. రెండు రోజుల్లో వస్తుందని చెప్పడంతో రైతులు శాంతించారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాం ఎదుట రైతులు బారులు తీరారు. గోదాంకు బుధవారం 275బస్తాల యూరియా రాగా క్యూలో ఉన్న రైతులకు ఒక్కో బస్తా ఇచ్చారు. చొప్పదండి మండలం కొలిమికుంట గోదాములో చొప్పదండి పీఏసీఎస్ ద్వారా యూరియా పంపిణీ చేశారు. చీకట్ల లక్ష్మి అనే మహిళ యూరియా తీసుకొని వెళ్తుండగా బస్తా కింద పడటంతో కొద్దిగా యూరియా మట్టిలో కలిసింది. ఇంతటి యూరియా కష్టం ఎన్నడు రాలేదని కింద పడ్డ యూరియాను కొంగులో కట్టుకొని వెళ్లింది. కొలిమికుంటలో ఒక్కో రైతుకు ఒక్క బస్తా కూడా ఇవ్వలేదన్నారు.