
సీఈవోల బదిలీపై హైకోర్టు స్టే
కరీంనగర్‌రూరల్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. జిల్లాలో మొత్తం30 ప్రాథమిక సహకార సంఘాలుండగా గత నెల 26న ఒకే సంఘంలో సీఈవోగా మూడేళ్లకు పైబడి పనిచేసిన 23 మందిని బదిలీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని డీఎల్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసినప్పటికి జీతాల చెల్లింపు, రిటైర్మైంట్ బెనిఫిట్స్ సౌకర్యాలపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో పలువురు సీఈవోలు హైకోర్టును ఆశ్రయించారు. బదిలీ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ స్టే పిటిషన్ దాఖలు చేశారు. ఒకేసారి కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సీఈవోలు వ్యక్తిగతంగా విడతల వారీగా పిటిషన్లు దాఖలు చేస్తూ స్టే తెచ్చుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 23మందిని బదిలీ చేయగా ఇప్పటివరకు 15మంది స్టే తెచ్చుకోవడంతో యథాస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు.