
● జిల్లాకు సరిపడా యూరియా సరఫరా ● అయినా అందరినీ వేధిస్తు
మంథని: జిల్లాలో యూరియా కొరత లేదని, సరిపడా సరఫరా అవుతోంద ని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పదేపదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, యూరియా కోసం జిల్లాలో చాలాచోట్ల రైతులు వ్యవసాయ సహకార సంఘాలు, ఇతరత్రా గోదాముల ఎదుట బారులు తీరడం, ధార్నాలకు దిగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే, సరిపడా సరఫరా అవుతున్నా అన్నదాతలు ప్రత్యక్ష ఆందోళనకు దిగే పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని, ఇందుకు కారకులు ఎవరు? అనేదానిపై సమాధానాలు చెప్పేవారు కరువయ్యారు. అయితే, అధికారుల ముందుచూపు లేమి ప్రధాన కారణమని జిల్లావ్యాప్తంగా చర్చ జోరందుకుంది.
పక్క జిల్లాలు.. పొరుగు రాష్ట్రాలకు యూరియా..
జిల్లాలో సాగు చేసిన పంటల ఆధారంగా సుమారు 28 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈమేరకు 20 వేల పైచిలుకు మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు చెబుతున్నారు. మూడు దశల్లో యూరియాను పంట పొలాలకు రైతులు ఉపయోగిస్తారు కానీ.. ఇప్పటికే మూడు విడదలకు సరిపడా జిల్లాకు వచ్చిచేరినట్లు తెలియవచ్చింది. జిల్లాలో ఆలస్యంగా వరినార్లు వేసుకునే మంథని మండలంలోని 32,500 మంది రైతులకు 80 వేల బస్తాలు అవసరం ఉంటుంది. ఇప్పటికే 70 వేల యూరియా బస్తాలు సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మూడోవిడతలో యూరియా చల్లేందుకు ఈనెల చివరి వరకు సమయం ఉంది. కానీ, ఈసీజన్‌కు సరిపడా యూరియాను అధికారులు ఇప్పటికే రైతులకు సరఫరా చేశామంటున్నారు. అయినా, ఆగ్రోస్, ఎరువుల దుకాణాలు, వ్యవసాయ సహకార సంఘాల ఎదుట ఆందోళనకు దిగడం నిత్యకృత్యమైంది. సమీపంలోనే ఉన్న మంచిర్యాల జిల్లాతోపాటు మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతాలకు యూరియా పెద్దఎత్తున తరలిపోయిందనే వాదనలు ఉన్నాయి. ఈక్రమంలోనే జిల్లా రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని అంటున్నారు.
ముందే కట్టడి చేస్తే కష్టాలు ఉండేవి కావు..
జిల్లాలో యూరియా కొరత తలెత్తడంతో అధికారులు ఆలస్యంగా తేరుకున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా రావాణా చేస్తున్న యూరియాను పట్టుకుంటున్నారు. అంతా అయిపోయాక హడావుడి అన్నట్లున్న వారితీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు కట్టడి చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల్లో పెద్దఎత్తున నిల్వలు ఉన్న సమయంలో స్థానిక రైతులు కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇదేఅదనుగా భావించిన పక్క జి ల్లా, పొరుగు రాష్ట్రానికి చెందిన రైతులు, కొందరు అక్రమార్కులు ఇక్కడి యూరియాను కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకొని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే స్థానిక రైతులకు యూరియా కష్టాలు ఎదురవుతున్నాయంటున్నారు. అధికారులు ముందే అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చెక్‌పోస్టులు, ఇతరరత్రా కట్టడి చర్యలు తీసుకోవడంలో అర్థం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అలసత్వం.. అన్నదాతలకు శాపం
అభద్రతా భావంతో నిల్వలు
కొందరు రైతులు అభద్రతా భావంతో సీజన్‌కు సరిపడా యూరియా ముందే కొనుగోలుచేసి తమ ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. అంతేకాకుండా మంథని సమీపంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన చెన్నూర్, జైపూర్, శివ్వారం గ్రామాల రైతులు ఇక్కడినుంచి ఎరువులు తీసుకెళ్లే ఆనవాయితీ కొనసాగుతోంది. ఇలాంటి కారణాలతో యూరియా కొరత ఏర్పడింది. మంథని ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా స్టాక్ తీసుకొచ్చి నిల్వచేశాం. కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలతో గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నాం.
– అంజని, ఏడీఏ, మంథని

● జిల్లాకు సరిపడా యూరియా సరఫరా ● అయినా అందరినీ వేధిస్తు