
గణేశునికీ జియోట్యాగింగ్
నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి
జగిత్యాలక్రైం: వినాయక నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. జగిత్యాల జిల్లాలోని వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించినవారు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో పొందుపర్చాలని ఆదేశాలివ్వడంతో నిర్వాహకులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా పోలీసు శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ప్రతీ విగ్రహానికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ని విగ్రహాలు..? ఎన్ని మండపాలు పెడుతున్నారో పూర్తిస్థాయిలో వివరాలను సేకరించేందుకు పోలీస్‌శాఖ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తోంది. అనుమతి లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు తీసుకుంటామని ఇదివరకే ఆదేశాలు జారీ చేయడంతో యువజన సంఘాల సభ్యులు, మండప నిర్వాహకులు సహకరిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 3,076 మండలపాలను ఏర్పాటు చేసినట్లు తెల్సింది. వాటికి వంద శాతం జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. వీటి వద్ద అనుకోని ఘటనలు జరిగితే పోలీసులు నేరుగా అక్కడికి చేరుకోవడానికి వీలుంటుంది. అడ్రస్ సరిగా తెలియక ఆలస్యం కాకుండా ఇప్పుడిక నిమిషాల్లో చేరుకునేలా ప్రణాళిక రూపొందించింది.
అనుమతి తప్పనిసరి
సాంకేతికను జోడించడానికి పోలీసులు వినాయక నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సాగుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఠాణాల వారిగా వచ్చిన దరఖాస్తులను పోలీసు అధికారులు పరిశీలించి అనుమతి ఇచ్చారు. వీటిల్లో కొలువుదీరిన విగ్రహాలకు జియోట్యాగింగ్ చేశారు. మండపాల వద్దగానీ, శోభాయాత్ర సమయంలో గానీ అనుకోని ఘటనలు జరిగితే క్షణాల్లో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంది.
ఇలా చేస్తున్నారు
ఎస్సైతోపాటు బ్లూకోల్ట్స్, 100 డయల్ సిబ్బంది వద్ద ట్యాబ్‌లు ఉన్నాయి. వీరందరూ పట్టణాలు, గ్రామాల్లోని గణపతి మండపాలను పరిశీలిస్తున్నారు. కమిటీ నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు, మండపం ఏ ప్రాంతంలో ఉందో అనే వివరాలను సేకరించి ఆ తర్వాత ట్యాబ్‌లో గణపయ్య విగ్రహాన్ని ఫొటో తీసి ఆన్‌లైన్ ద్వారా జియోట్యాగింగ్ చేస్తున్నారు. అందులోని లొకేషన్ ఆప్షన్‌ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతంలోని గుర్తులు నమోదు అవుతాయి. అలాగే నిమజ్జనం ఏ రోజున, ఏ చెరువులో చేస్తారనే వివరాలను సేకరిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో విగ్రహాల వివరాలు
ప్రతీ మండపంపై ప్రత్యేక నిఘా
జగిత్యాల జిల్లాలో 3,076 విగ్రహాల ఏర్పాటు
100 శాతం జియోట్యాగింగ్ పూర్తి
మండప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రివేళ తప్పనిసరిగా ఉండాలి. విగ్రహాలను గుర్తించేందుకు ప్రతి విగ్రహం వద్దకు సిబ్బంది వెళ్లి ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రాత్రివేళ గస్తీ ముమ్మరం చేశాం. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్, 100 డయల్ సిబ్బంది నిరంతరం వినాయక మండపాలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. వందశాతం జియోట్యాగింగ్ పూర్తయింది.
– అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ

గణేశునికీ జియోట్యాగింగ్