
ఎండాకు తెగులు.. సస్యరక్షణే మేలు
కరీంనగర్ అర్బన్: అసలే వర్షాలు సకాలంలో కురవక ఇబ్బందులుపడ్డ రైతులను తెగుళ్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం వరి పిలక దశలో ఉండగా పంటకు బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశిస్తోంది. ఇది పంట దుబ్బు కట్టే దశలో ముఖ్యంగా సన్నగింజ రకాల్లో మరింతగా సోకుతుందని డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డా.హరికృష్ణ వివరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండాకు తెగులు గుర్తించగా నివారణ చర్యలను వివరించారు. అయితే ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో సోకనుండగా నివారణకు ఎలాంటి మందులు లేవు. లక్షణాలు గుర్తించి సస్యరక్షణ చ ర్యలు చేపట్టడం ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో తె గులు సోకిన పంటకు అనుసరించాల్సిన యా జమాన్య చర్యలను డా.హరికృష్ణ వివరించారు.
ఎండాకు తెగులు లక్షణాలిలా..
తెగులు ఆశిస్తే ఆకుల మీద పసుపురంగు నీటి డాగు మచ్చలు ఏర్పడి అంచుల వెంట పైనుంచి కింది వరకు అలల మాదిరిగా వ్యాప్తి చెందుతుంది. ఉదయం వేళ ఈ మొక్కలను గమనిస్తే ఆకుల నుంచి పచ్చని జిగురు పదార్థం కనిపిస్తుంది. ఇది సూర్యరశ్మికి గట్టిపడి చిన్న ఉండలుగా మారి గాలి వీస్తే నీటిలో పడతాయి. తర్వాత ఇతర మొక్కలు, పొలాలకు వ్యాపిస్తాయి. ఈ లక్షణాలపై రైతులకు అవగాహన ఉండాలి. లేదా స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించాలి.
యాజమాన్య చర్యలు
రైతులు నిత్యం పొలాన్ని గమనిస్తూ ఉండాలి. లక్షణాలు 5శాతం కంటే ఎక్కువైతే నత్రజని వేయడం తాత్కాలికంగా ఆపేయాలి. తెగులు సోకిన పొలం నుంచి ఇతర పొలాలకు నీరు పారకుండా చూడాలి. పొటాష్‌ను దమ్ములో, ఆఖరి దఫాగా ఎకరానికి 15 కిలోలు వేయాలి. ఏటా తెగులు సోకితే తట్టుకునే రకాలు సాగు చేయాలి. దుబ్బుకట్టే దశ నుంచి చిరు పొట్ట దశలో గమనిస్తే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. ప్లాంటా మైసిన్ లేదా పోషమైసిన్ లేదా అగ్రిమైసిన్ 0.4గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో తెగులు వ్యాప్తిని కొంతమేర నియంత్రించొచ్చు.
తెగులుకు పలు కారణాలు
గాలిలో తేమశాతం అధికంగా ఉండడం, ఎడతెరిపి లేని చిరుజల్లులు కురవడం, గాలులు వేగంగా వీయడం, సగటు ఉష్ణోగ్రతలు 22–26 సెంటీ గ్రేడ్ మధ్య ఉండడం వంటి కారణాలతో తెగులు సోకుతుంది. రైతులు పైపాటుగా అధిక మోతాదులో నత్రజని వాడడంతో ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
వరిని వెంటాడుతున్న సమస్య