
పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు
కరీంనగర్ అర్బన్: పెన్షన్ భిక్ష కాదు అని ఉద్యోగుల హక్కు అని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు, టీషర్ట్‌లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి అహర్నిశలు శ్రమించే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వరా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీవితం బజారున పడడమే కాకుండా దాచుకున్న డబ్బు, మెడికల్, జీపీఎఫ్ బిల్లులు తదితర వాటి కోసం ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాగే కొనసాగితే ఏ ఉద్యమానికై నా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్‌గౌడ్, టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల జిల్లా కార్యదర్శి అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల కేశవరెడ్డి, లింగయ్య, టీచర్ల సంఘం నాయకులు రఘుశంకర్‌రెడ్డి, రవీంద్రచారి, కరుణాకర్‌రెడ్డి, టీఎన్జీవోల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.