
‘పరిషత్’ ఎన్నికలకే మొగ్గు
కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు ఈనెల 30లోగా నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఆ దిశగా కసరత్తు మొదలైంది. మొదట పరిషత్, తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం తలమునకలైంది. ఇందులో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించి వాటిపై అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితా ప్రదర్శనకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జెడ్పీ సీఈవోలు ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలను జెడ్పీ, మండల పరిషత్తులలో ప్రదర్శించాలని ఆదేశాలు అందాయి. 8న జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సూచించింది. వాటిపై అభ్యంతరాలుంటే 8 వరకు లిఖిత పూర్వకంగా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. వాటిని 9లోగా పరిష్కరించి, 10న తుది జాబితా ప్రదర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది.