
ఉపాధిలో అవకతవకలు.. రికవరీకి ఆదేశాలు
గన్నేరువరం(మానకొండూర్): ఉపాధి హామీ పనుల్లో రూ.2,13,620 అవకతకలు జరుగగా, వాటిలోంచి కొందరు పెనాల్టీ విధించగా, మరికొందరి నుంచి రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మొత్తం రూ.4,64,61,662 పనులు చేపట్టారు. ఈ పనులపై సోమవారం డీఆర్‌డీవో శ్రీధర్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక మండలకేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. వివిధ గ్రామాల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. వీటిలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి సంబంధించి గ్రామాలవారీగా పెనాల్టీ, రీకవరి డబ్బులు ఇలా ఉన్నాయి.. గన్నేరువరం రూ.4812, చొక్కారావుపల్లె రూ.600, యాస్వాడ రూ.96,921, గునుకులకొండాపూర్ రూ.10,336, మాదాపూర్ రూ.17,649, చాకలివానిపల్లె రూ.4,000, మైలారం రూ.12,400, సాంబయ్యపల్లె రూ.1,600, జంగపల్లి రూ.8,604, పీచుపల్లి రూ.5,790, హన్మజిపల్లె రూ. 10,988, గోపాల్‌పూర్ రూ.1,496, ఖాసీంపేట రూ.12,537, పారువెల్ల రూ.13,411, చీమలకుంటపల్లె రూ.10,976, గుండ్లపల్లి రూ.1,500 అవకతవకలు జరిగాయి. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.