
స్వాతంత్య్రసమరయోధుడు కిష్టయ్య కన్నుమూత
మంథని: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య(98) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో తుదిశ్యాస విడిచారు. హైదరాబాద్‌లో మృతి చెందిన రాంపెల్లి కిష్టయ్య పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తీసుకురాగా.. మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ కుమారస్వామి సోమవారం సందర్శించారు. అధికారికంగా నివాళి అర్పించారు. అనంతరం గోదావరి తీరంలో ఆయన కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆనాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో రాంపెల్లి కిష్టయ్య ఒకరు. ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ లభించినా.. తెలంగాణకు నిజాం సంస్థానం నుంచి ప్రజలకు స్వాతంత్య్రం లభించలేదు. అయితే మమారాష్ట్రలోని చాందా క్యాంపులో సైనిక శిక్షణ పొంది.. సాయుధ పోరాటం ద్వారా నిజాం పాలనకు వ్యతిరేకంగా కిష్టయ్య పోరాటం చేశారు. మంథని ప్రాంతం నుంచి చాలామంది సాయుధ పోరాటంలో పాల్గొనగా.. అందులో అందరూ ఇదివరకే మృతి చెందారు. వారిలో మిగిలిన రాంపెల్లి కిష్టయ్య కూడా కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
కిష్టయ్య లేనిలోటు తీర్చలేనిది
మంథని: కాగా, రాంపెల్లి కిష్టయ్య లేనిలోటు తీర్చలేదని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాంపెల్లి కిష్టయ్య మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి.. ప్రభుత్వం పక్షాన శ్రద్ధాంజలి ఘటించారు.

స్వాతంత్య్రసమరయోధుడు కిష్టయ్య కన్నుమూత