
అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయ్
కరీంనగర్: కాంగ్రెస్ అబద్ధాల పాలనను ఆపేసి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల ప్రకారం సోమవారం బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు లోయర్ మానేరుడ్యాం నుంచి కాళేశ్వరం జలాలను సేకరించి మార్కెట్‌రోడ్‌లో గల అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నారదాసు, అనిల్ మాట్లాడుతూ, రాజకీయ దురుద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ పేరును అప్రతిష్ట పాలు చేసేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేవలం రెండు ఫిల్లర్లలో మాత్రమే పగుళ్లు వచ్చాయని, వాటికి మరమ్మతు చేపట్టకుండా విచారణ పేరిట ప్రాజెక్టును అపవిత్రం చేశారన్నారు. ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, వారి ఆత్మలు శాంతించాలని అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం చేసినట్టు తెలిపారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, పిల్లి శ్రీలత, తిరుపతినాయక్, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
స్తూపాన్ని శుద్ధి చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు