
నెలక్రితం తండ్రి.. ఇప్పుడు కొడుకు..
● బైక్ అదుపుతప్పి దుర్మరణం ● తండ్రి మరణించడంతో నిద్ర కోసం బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం
ఇల్లంతకుంట(మానకొండూర్): నెల క్రితం తండ్రి చనిపోగా.. నిద్ర కోసం ఆదివారం తన అన్నతో కలిసి బంధువుల ఇంటికి బైకుపై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన జక్కుల నవీన్ (30), రామచంద్రం సోదరుల తండ్రి నెలరోజుల క్రితం చనిపోయాడు. ఈక్రమంలో హైదరాబాదులో ఉన్న తన చిన్న తమ్ముడి అత్తగారింటికి నిద్ర కోసమని నవీన్, రామచంద్రం ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై బయలుదేరారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి సమీపంలో హైవే రోడ్డుపై ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నవీన్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, రామచంద్రంకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా నవీన్‌కు ఇంతకుముందు ఓసారి వ్యవసాయ బావిలో పడగా గాయాలయ్యాయని, మరోసారి ప్రమాదానికి గురికాగా కాలు విరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. మతుడికి భార్య శ్రీవాణి, కొడుకు అనన్యన్, కూతురు అనన్య ఉన్నారు. నెల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.