
ఆటోట్రాలీ బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయాలు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఆటవిడుపుగా క్రికెట్ మ్యాచ్ ఆడుకొని వస్తున్న విద్యార్థుల ఆటోట్రాలీ బోల్తాపడడంతో 13 మందికి స్వల్ప, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక పోతనకాలనీలోని ఓ గణేశ్ మండపం నిర్వాహకులు ఆదివారం 26 మంది విద్యార్థులకు సింగరేణి స్కూల్ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ అనంతరం ఆటోట్రాలీలో పోతనకాలనీకి వస్తున్న క్రమంలో మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. సుమారు 15 మంది విద్యార్థులకు గాయాలు కాగా, శ్రీనేయన్, ఆద్విత్ తీవ్రంగా గాయపడ్డారు. తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఒకరిని కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.