
బెట్టింగ్ బాబోయ్..
సిరిసిల్లక్రైం: క్షణాల్లో లక్షలు సంపాదించేందుకు పలువురు ఆన్‌లైన్‌లో మార్గాలను వెతుకుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. నిమిషాల వ్యవధిలో పెట్టిన సొమ్ముకు ఎక్కువ రావడంతో ముందుగా రూ.వందలతో ప్రారంభించిన బెట్టింగ్.. రూ.లక్షల్లోకి చేరుకొని తీరా క్షణాల్లోనే నష్టాలను చవిచూసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రావడం కాదు.. పోవడమే..
ఇదివరకు చాలామంది పేకాట, మట్కా ఆడుతూ లక్షల రూపాయలు పోగొట్టుకోవడమే కాకుండా కటకటాలకు వెళ్లినవారున్నారు. ప్రస్తుతం సులభంగా డబ్బు సంపాదించే ప్రక్రియ రూటు మారింది. కొంతమంది స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తున్నాయన్న ప్రచారంతో దానిలో అనుభవం లేకపోయినా పెట్టుబడి పెట్టి నష్టాలపాలవుతున్నారు. దీనికి సమాంతరంగా ప్రస్తుతం బెట్టింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఏదేని సామాజిక మాధ్యమంలో సినిమా, సీరియల్, జోక్స్ వీక్షించే క్రమంలో వచ్చే ప్రకటనలతో ఆకర్షితులై ఆన్లైన్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని పెట్టుబడులు పెడుతున్నారు. నిమిషాల వ్యవధిలో ఒకట్రెండు దఫాలుగా లాభాలు రావడంతో మరికొంత సంపాదించుకుందామనే క్రమంలో కొండంత నష్టాన్ని చవిచూస్తున్నారు. బెట్టింగ్ వ్యసనంతో పలువురు వ్యాపారులు, ఉద్యోగులు, యువకులు చివరకు చావు మీదకు తెచ్చుకుంటున్నారు.
కృత్రిమ సమస్యలు సృష్టిస్తూ..
బెట్టింగ్ జరిపే సమయంలో ఇంటర్నెట్ సమస్య ఉంటే ఇక అకౌంట్లో జమ చేసిన డబ్బులన్నీ మాయం అయినట్లే. కాగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులే ఎదో ఒక రకంగా ఇంటర్‌నెట్‌కు అంతరాయం కలిగించి, వందలాది మంది నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. బెట్టింగ్ చేసే వ్యక్తి ఫోన్ నంబర్‌ను సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసే సమయంలో నమోదు చేయడంతో, ఆ నంబర్‌కు యాప్ నిర్వాహకులే బెట్టింగ్ సమయంలో కాల్ చేసి అంతరాయం కలిగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
సులభమార్గంలో డబ్బు వచ్చే విధానాలను నమ్మవద్దు. బెట్టింగ్ యాప్‌లతో జరుగుతున్న ఆర్థిక నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. స్టాక్, సైబర్, బెట్టింగ్, రమ్మీ తదితర ఆన్‌లైన్ గేమ్స్‌పై కఠిన నిఘా కొనసాగుతోంది. యువకులు, వ్యాపారులు తమకు ఏమైనా సమస్యలు ఉంటే నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లాలి.
– మహేశ్ బీ గితే, ఎస్పీ,
రాజన్న సిరిసిల్ల
‘చందుర్తి మండలానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. స్నేహితులకు ఫోన్ చేసి తనకు అత్యవసరంగా రూ.2 లక్షలు కావాలని, జీతం రాగానే ఇస్తానని తెలిపాడు. కొన్నాళ్లు ఇలాగే తన ఫ్రెండ్స్ వద్ద దాదాపు రూ.50 లక్షలు అప్పు చేశాడు. అప్పు ఇచ్చినవారందరూ ఆరా తీయగా, బెట్టింగ్‌లో పెట్టి నష్టం వచ్చినట్లు తెలుసుకున్నారు. చివరకు అతడి అమ్మానాన్న పొలం అమ్మి అప్పులు చెల్లించారు’.
‘సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తి చిట్‌ఫండ్స్‌లో పని చేసేవాడు. అతడికి రోజువారీ కలెక్షన్‌లో వచ్చిన సొమ్మును కొంచెంకొంచెం ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టేవాడు. ఆఫీస్‌కు కలెక్షన్ తక్కువ చూపేవాడు. కొద్దిరోజులకు అలా తీసిన సొమ్ము రూ.లక్ష వరకు చేరింది. బెట్టింగ్‌లో డబ్బు పోవడంతో కలెక్షన్ చేసిన సొమ్ము ఆఫీసుకు ఎలా ఇవ్వాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు’.

బెట్టింగ్ బాబోయ్..