
భార్య, కూతురును ఇంటి నుంచి గెంటేసిన భర్త
● సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త ● పోలీసు ఉన్నతాధికారులు న్యాయంచేయాలని వేడుకుంటున్న బాధితురాలు
చిగురుమామిడి: భర్త ఇంటినుంచి గెంటేయడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది ఓ బాధితురాలు.. చిగురుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్‌కు చెందిన స్రవంతికి ఇదే మండలం సుందరగిరికి చెందిన వ్యక్తితో 2011లో వివాహం జరిగింది. సదరు వ్యక్తి సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కొద్దిరోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి 12 ఏళ్ల కూతురు ఉంది. కొద్దిరోజులుగా స్రవంతిని భర్త వేధిస్తున్నాడు. ఆమె అత్తగారిల్లయిన సుందరగిరిలో ఉంటోంది. భర్త వేధింపులు భరించలేక చిగురుమామిడి, కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లలో పలుసార్లు ఫిర్యాదు చేసింది. వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతడి ఆగడాలకు అంతులేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఆదివారం సుందరగిరికి చేరుకుని స్రవంతి, కూతురును ఇంటినుంచి వెళ్లగొట్టాడు. వారి సామగ్రి బయట పడేయడంతో తల్లీకూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు, గ్రామస్తులు ఎవరూ పట్టించుకోవడం లేదని, పోలీసు ఉన్నతాధికారులైనా తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.