
గర్భిణి హత్య కేసులో నలుగురి అరెస్ట్
ఇల్లందకుంట(హుజూరాబాద్): గర్భిణి హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం జమ్మికుంటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జి ఏసీపీ శ్రీనివాస్‌జీ వివరాలు వెల్ల డించారు. ఇల్లందకుంట మండలం టేకుర్తికి చెందిన ముద్రబోయిన రాములు కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం ఇదే మండలం కనగర్తికి చెందిన రేణుకతో వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు అభిషేక్, బన్నీతేజ. ఒకసారి వరంగల్ వెళ్లి వస్తున్న క్రమంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భర్తతో వేరుగా ఉంటున్న చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమల(32)తో పరిచయం ఏర్పడింది. 8 ఏళ్ల క్రితం తిరుమలను రాములు రెండో పెళ్లి చేసుకుని టేకుర్తిలో వేరే కాపురం పెట్టాడు. దీంతో మొదటి భార్య, ఆమె కొడుకులు తిరుమలపై కక్ష పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవారు. ప్రస్తుతం తిరుమల 7నెలల గర్భిణి. తిరుమల గర్భిణి కావడం ఇష్టంలేని భర్త రాములు, మొదటి భార్య రేణుక, కొడుకులు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. వీరి చిన్నకుమారుడు బన్నీతేజను హత్యకు ప్రేరేపించారు. ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేశారు. అదునుచూసి తిరుమల ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో బన్నీతేజ ఆమె గొంతు కోసి, విచక్షణరహితంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో జమ్మికుంట రూరల్, పట్టణ సీఐలు లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఎస్సై క్రాంతికుమార్ పాల్గొన్నారు.