
పెద్దపల్లి– నిజామాబాద్ లైన్‌లో ‘వందేభారత్’
సాక్షిప్రతినిధి,కరీంనగర్: పెద్దపల్లి–నిజామాబాద్ లైన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోంది. రాత్రి 11 గంటలకు ఎగువన ఉదయం 4 గంటలకు దిగువన ఇదే మార్గంలో పెద్దపల్లి బైపాస్ మీదుగా నడుస్తోంది. ఇటీవలే ముంబయి నుంచి జాల్నా వరకు నడుస్తున్న 20706 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నాందేడ్ వరకు పొడిగించారు. కానీ.. ఈ రైలు ప్రాథమిక నిర్వహణ చర్లపల్లిలో చేస్తున్నారు. ఇది నాందేడ్ నుంచి చర్లపల్లి వరకు వయా నిజామాబాద్– కామారెడ్డి మార్గంలో ఖాళీ రైలుతో దిగువ వైపు, మళ్లీ వచ్చేటప్పుడు కూడా చర్లపల్లి నుంచి నాందేడ్ వరకు ఖాళీ రైలుతో నడుస్తుంది. రెండు రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు సమీపంలో పట్టాలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఫలితంగా ఈ మార్గంలో నడుస్తున్న పలు రైళ్లను నిజామాబాద్– పెద్దపల్లి బైపాస్–కాజీపేట మార్గంలో దారి మళ్లించి నడుపుతున్నారు. భవిష్యత్తులో ఈ మార్గం గుండా వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్, అమృత్ భారత్ లాంటి రైళ్లు ప్రవేశ పెడితే ఈ ప్రాంత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగే అవకాశం ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.