
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అనుమతివ్వండి
మల్లాపూర్(కోరుట్ల): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైందని, ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ అనుమతి ఇవ్వాలని బాధితులు వేడుకున్న ఘటన మల్లాపూర్ మండలం మొగిలిపేటలో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఓదెల గజానంద్–సరోజన దంపతుల ఇళ్లు శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఆ ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ అనుమతి, ఫొటో క్యాప్చర్ కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా, ఇంటి నిర్మాణ స్థలంపై ఫిర్యాదు వచ్చిందని, ఆ వివాదం పరిష్కారమయ్యే వరకు అనుమతితో పాటు ఫొటో క్యాప్చర్ తీయలేనని సమాధానమివ్వడంతో బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే భాగ్యం లేదా అంటూ బాధితులు నిరసన తెలిపారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సౌజన్యను వివరణ కోరగా, ఓదెల సరోజన–గజానంద్ దంపతులు నిర్మించుకుంటున్న ఇంటి వెనుకవారితో దారి వివాదం ఉందని తెలిపారు. వివాదం పరిష్కరించుకొని అనుమతి కోసం రావాలని బాధితులకు సూచించామని పేర్కొన్నారు.