
మారుమూల గ్రామం నుంచి ప్రపంచ వేదికపైకి..
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని డబ్బుతిమ్మాయిపల్లికి చెందిన అనంతుల దేవయ్య, నర్సవ్వ కూమరుడు రవీందర్ క్రమశిక్షణతో క్రీడారంగంలో విశేష స్థానం సంపాదించుకున్నాడు. పట్టుదలతో సాధన చేస్తూ ఖోఖో వరల్డ్ కప్‌లో భారత జట్టుకు అంపైర్‌గా సేవలందించి ఆదర్శంగా నిలిచారు. కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయన.. ఇంటర్మీడియట్ మేడిపల్లి, డిగ్రీ కరీంనగర్‌లోని ఎస్సారార్ కాలేజీలో పూర్తిచేశాడు. ఐదో తరగతిలో ఖోఖోపై ఆసక్తి పెంచుకుని, ఏడో తరగతిలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. కరీంనగర్‌లో చదువుకుంటున్న సమయంలో భాస్కరరావు ప్రోత్సాహం, మహేందర్‌రావు ఆర్థిక సాయంతో కెరీర్‌ను మెరుగుపర్చుకున్నారు. 2003లో బీపీఎడ్, 2006లో ఎంఎడ్ పూర్తిచేసి 2009లో మెట్‌పల్లిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. 1999లో ఆల్ ఇండియా రూరల్ నేషనల్‌లో బంగారు పతకం, 2001లో ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. క్రీడలంటే ఆసక్తి ఉన్నవారు దాన్నే కెరీర్‌గా మలుచుకోవచ్చని, కఠిన శ్రమ, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత, శరీర సాధన తప్పనిసరి అని రవీందర్ పేర్కొన్నారు.