
నేడు ఎల్‌ఎండీ గేట్లు ఎత్తే అవకాశం
తిమ్మాపూర్: ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి వచ్చే వరద నీటి ప్రవాహంతో ఎల్‌ఎండీ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 56,944 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రం వరకు 16.263 టీఎంసీలకు చేరిందన్నారు. మోయతుమ్మెద వాగు నుంచి 11,944 క్యూసెక్కులు, మధ్యమానేరు నుంచి 45 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు వివరించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో స్పిల్‌వే గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. దిగువన ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ ఎస్‌ఈ పి.రమేశ్ సూచించారు. పశువులు, గొర్రెల కాపరులు, జాలరులు, రైతులు, నదిని దాటే ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.