
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు
● కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ● కరీంనగర్‌లో 15 మందికి ఎలక్ట్రిక్ ఆటోల అందజేత
కరీంనగర్‌టౌన్: మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తా వద్ద బుధవారం 15మంది నిరుపేద మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో ఆటో విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని, అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేశారన్నారు. కార్పొరేట్ రెస్పాన్స్ బిలిటీ ఫండ్ (సీఆర్‌ఎఫ్) నిధులతో ఈ ఆటోలను కొనుగోలు చేశామని తెలిపారు. 15 మంది మహిళల్లో 10 మందికిపైగా పీజీ, బీటెక్ విద్యను పూర్తి చేసిన వారు ఉన్నారని అన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో 15 మందికి 2నెలలపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వగా.. డ్రైవింగ్ లైసెన్సులు అందించిన అనంతరం ఆటోలు పంపిణీ చేశామన్నారు. ఏ ఇంట్లోనైతే మహిళలకు ఇంటి తాళంచెవి అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుందన్నారు. కరీంనగర్ జిల్లా పరిపాలనా బాధ్యతలను మహిళ చేతిలో పెట్టామని, వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే పనులెన్నో చేస్తున్నారని అన్నారు. అనంతరం బండి సంజయ్, సునీల్‌రావు ఆటోలో ప్రయాణించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ పాల్గొన్నారు.