
గ్రామానికి కీడు సోకిందని..
ఇల్లందకుంట:జిల్లాలోని ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామానికి కీడుసోకిందని గ్రామస్తులంతా బుధవారం కీడు నివారణ వంటలకు వెళ్లారు. గ్రామంలో ఐదునెలలుగా వివిధ కారణాలతో చనిపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఒకరు మృతిచెంది పక్షం రోజులు కాకముందే మరొకరు చనిపోతున్నారని అన్నారు. ఈ విషయమై ఓ పండితుడిని కలిశారు. గ్రామంలో వరుస మరణాలకు కీడే కారణమని అతను చెప్పాడు. గ్రామస్తులు కీడు భోజనాలకు వెళ్లాలని సూచించాడు. దీంతో ముందురోజే గ్రామంలో పెద్దలు దండోరా వేయించారు. బుధవారం ఉదయం 6 గంటలకే ఇళ్లకు తాళాలు వేసి, ఊరు విడిచి వెళ్లారు. పొలాల వద్ద వంట చేసుకుని, భోజనాలు చేశారు. తిరిగి 5గంటలకు ఇల్లు చేరారు. గురువారం బొడ్రాయి, భూలక్ష్మికి పూజలు చేస్తామని తెలిపారు.