
డెంగీ బెల్స్!
కరీంనగర్‌టౌన్ ●:
వర్షాకాలం.. వ్యాధులకు నిలయంగా మారుతోంది. దోమలు విజృంభించి వైరల్ ఫీవర్లు పెరుగుతున్నా యి. వాతావరణంలో మార్పులతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతుండగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య పెరుగుతోంది. మరోవైపు జిల్లాలో డెంగీబెల్స్ మోగుతున్నాయి. చాపకింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. ఫీవర్ సర్వేతో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పారిశుధ్య సమస్యలు ఏర్పడగా.. దోమల వృద్ధితో సీజనల్ వ్యాధులు ప్రబలుతుతున్నాయి.
ఇంటింటా సర్వే..
గ్రామీణ ప్రాంతాలతో పాటు కరీంనగర్ సిటీలోనూ జ్వరపీడితులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటింటా సర్వేతో వ్యాధుల కట్టడికి నిర్ణయించారు. గత నెల 27వ తేదీ నుంచి జ్వర పీడితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ చివరి వరకు సాగే ఈ సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1,22,000 ఇళ్లలో పర్యటించి, 3,99,400 మందిని సర్వే చేశారు.
అవగాహన.. వైద్యసేవలు
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు జ్వరం వచ్చిన వారికి చికిత్స అందేలా పర్యవేక్షిస్తారు. జ్వరబాధితుల ఇళ్లలోని అనారోగ్యంతో ఉన్న వారి రక్తనమూనాలు సేకరిస్తారు. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడే వారికి మందులు ఇవ్వడంతో పాటు డెంగీ లక్షణాలు ఉంటే నిర్ధారించాక ఆస్పత్రులకు తరలిస్తారు. గ్రామాల్లో ఫాగింగ్ చేయించడం.. మురికి గుంతల్లో టీమోఫాస్ స్ప్రే, ఆయిల్ బాల్స్ వేయిస్తూ జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు.
14 డెంగీ కేసులు
జిల్లాలో వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా నిర్వహిస్తున్న సర్వేతో 14 డెంగీ కేసులు బయటపడ్డాయి. వీరందరిని ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మామూలు జ్వరం ఉన్న వారికి అక్కడికక్కడే చికిత్స అందించడం, దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి మందులు ఇప్పించడం వంటివి చేస్తున్నారు. డెంగీ ప్రభావం గతేడాది కన్నా ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు వరకు జిల్లాలో 34 డెంగీ కేసులు నమోదయ్యాయి. దోమలు కుట్టకుండా రక్షణ పొందాలని, కాచి చల్లార్చిన నీరే తాగాలని, వేడివేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు సరఫరా చేసే ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయిస్తున్నారు.
24 బృందాలతో పర్యవేక్షణ
ఇంటింటి సర్వే పర్యవేక్షణకు 24 బృందాలను నియమించారు. ఈ బృందాలు వ్యాధుల సీజన్ ముగిసే వరకు క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టడమే కాకుండా, వైద్య పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ బృందాలను జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో డిప్యూటీ డీఎంహెచ్ సారథ్యంలో అధికారుల బృందం పర్యవేక్షణ చేస్తోంది.
జిల్లాలో 14 కేసులు నమోదు
ఫీవర్ సర్వేతో వెలుగులోకి
4 లక్షల మందిని
సర్వే చేసిన వైద్యబృందాలు
నిరంతర పర్యవేక్షణ
సీజనల్ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ రూపొందించాం. ప్రతిరోజూ ఆరోగ్య బృందాలతో జ్వర సర్వే, డ్రై డే చేపడున్నాం. దోమల నియంత్రణ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేస్తున్నాం.
– డాక్టర్ రాజగోపాల్‌రావు, డిప్యూటీ
డీఎంహెచ్‌వో, జల్లా మలేరియా అధికారి

డెంగీ బెల్స్!