
మాటల మంటలు
● అర్బన్ బ్యాంకు చైర్మన్, మాజీ చైర్మన్ల మధ్య వార్ ● పోటాపోటీగా ప్రెస్‌మీట్లు ● చర్చకు సిద్ధమా అని చైర్మన్ సవాల్ ● బ్యాంకు పరువు తీయొద్దన్న మాజీ చైర్మన్
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్, మాజీ చైర్మన్ల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా జరిగిన అధిపత్యపోరు ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంతో రచ్చకెక్కింది. అర్బన్ బ్యాంకులో అక్రమాలు జరిగాయని, ఏకంగా మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్‌తో పాటు 15మంది సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. మంగళవారం గడ్డం విలాస్‌రెడ్డి, కర్ర రాజశేఖర్ పోటాపోటీగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకులో విలాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 3న జరిగిన సర్వసభ్య సమావేశాన్ని మాజీ చైర్మన్ రాజశేఖర్ తప్పుపట్టాడని ఆరోపించారు. హైకోర్టు ఆర్డర్‌లను తప్పుపట్టడం విడ్డూరమని అన్నారు. నకిలీ బంగారం విషయంలో కిందివారిపై చర్య తీసుకోకుండా బ్యాంక్ అధికారిని సస్పెండ్ చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. 2017లో ఎన్నికల వాయిదాకు, ఒకే ఇంట్లో 125 ఓట్లను చేర్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని విమర్శించారు. ఇంటింటి సర్వే ద్వారా 9000 ఓట్లు తీసేశారని, అవి బోగస్ ఓట్లు కాదా అన్నారు. సర్వేకు రూ.5లక్షల నష్టం జరిగిందని అది గత పాలకవర్గం తప్పు వల్లే అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ డైరెక్టర్‌గా ఉండేందుకు కుయుక్తులు చేస్తున్నారని అన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు.
బ్యాంకు పరువు తీయొద్దు: కర్ర రాజశేఖర్
అర్బన్ బ్యాంక్ పీఏసీ కమిటీ చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బ్యాంక్ పరువును దెబ్బతీసేలా ఉన్నాయని మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ మండిపడ్డారు. మంగళవారం నగరంలో మాట్లాడుతూ 2007 నుంచి 2017 వరకు పాలకవర్గంగా పనిచేశామని, ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. గత నెల 27న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కోరమ్ లేకుండా వాయిదా పడిందని, ఈ నెల 3న మరోసారి 208 మంది సభ్యులతో సమావేశం పెట్టినా అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. తమపై ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధమైన విచారణ జరగలేదని, ఎనిమిదేళ్లుగా ఎంకై ్వరీ లేదని పేర్కొన్నారు. బ్యాంకులో ఓవర్‌రైటింగ్ జరిగిందన్న ఆరోపణలకు తాము బాధ్యులు కాదని, మెంబర్షిప్ బుక్స్ సీఈఓ వద్ద ఉంటాయన్నారు. అప్పుడు పనిచేసిన రాజారాంరెడ్డి అనే సీఈఓపై తాము చర్యలు తీసుకున్నామని, ఆయన కోర్టు ద్వారా తిరిగి ఉద్యోగంలోకి వచ్చారని వివరించారు. 1982లో బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటినుంచి 25 ఏళ్లలో రూ.24కోట్లు మాత్రమే డిపాజిట్ కాగా, తమ పాలనలోనే రూ.60కోట్ల డిపాజిట్లు వచ్చాయని వివరించారు. 2017 తర్వాత 8 ఏళ్లలో కేవలం 10 కోట్లు మాత్రమే పెరిగాయని తేల్చిచెప్పారు. విలాస్‌రెడ్డికి తమ మెంబర్‌షిప్ రద్దు చేసే హక్కు లేదన్నారు.