కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్గే | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్గే

Aug 6 2025 6:24 AM | Updated on Aug 6 2025 6:24 AM

కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్గే

కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్గే

కొత్తపల్లి(కరీంనగర్‌): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ భగ్గుమంటుందని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ కుట్రలు.. కమిషన్‌ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను చింతకుంటలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. అనంతరం కమలాకర్‌ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్‌రావు ప్రజెంటేషన్‌ తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందన్నారు. ప్రభుత్వం తమదేనని విర్రవీగుతున్న కాంగ్రెస్‌ కొన్ని మీడియా సంస్థలకు కాళేశ్వరంపై లీకులు ఇస్తూ తప్పుడు ప్రచారం చేయిస్తోందని, ఆనాడు తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మినట్లే ప్రస్తుతం కుట్రలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆనాడు సమాజమంతా కేసీఆర్‌ వెంటే ఉండి తెలంగాణను సాధించుకుందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ కుట్రలను భగ్నం చేసేందుకు సమాజమంతా కేసీఆర్‌ వెంటే ఉందని చెప్పారు. ఆనాడు నెహ్రూ ఎస్సారెస్పీకి 1963లో పునాది వేస్తే..మళ్లీ 2016లో కెసిఆర్‌ కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారన్నారు. తెలంగాణలో 600 కిలో మీటర్లు ప్రవహించే గోదావరి నదిపై ఎందుకు ప్రాజెక్టులు నిర్మించలేదని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణను ఎడారి చేసే కుట్రలో భాగంగానే ఆనాటి పాలకులంతా నీటినంతా ఆంధ్రాకు తరలించారని మండిపడ్డారు. ఎడారిగా మారుతున్న తెలంగాణను సశ్యశ్యామలం చేసేందుకు కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి కేవలం మూడేళ్లలోనే పూర్తి చేశారన్నారు. దీంతో ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, చెరువులు, కుంటలన్నీ నిండి భూమికి బరువైన పంటలు పండాయన్నారు. రాష్ట్రంలో వలసలు తగ్గి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆభ్యంతరంతోనే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజె క్టు కట్టలేదని, సీడబ్ల్యూసీ అనుమతులు కూడా లభించకపోవడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే చంద్రబాబు పరిపాలన నడుస్తోందని, అందరూ ఒక్కటై మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు హైదరాబాద్‌లో వాలితే తెలంగాణ వాసులంతా వలసలు వెళ్లే ప్రమాదం పొంచి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బండ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, పొన్నం అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీలో ఎండగడతాం

కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement