
సూర్యప్రతాపం
వానాకాలంలో
కరీంనగర్‌రూరల్: వానాకాలంలో ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతుండగా జిల్లావ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి సూర్యుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతోంది. అపుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు ఎండ తీవ్రతను తగ్గించలేకపోవడంతో పగలు ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండ కాస్తుండటంతో సామాన్య ప్రజలతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు సాగునీళ్లందించేందుకు పడరానీపాట్లు పడుతున్నారు. ఆగస్టులోనైనా భారీ వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు నిరీక్షిస్తున్నారు.
ఉదయం 10గంటలకే..
పగటిపూట ఎండ వేసవిని తలపిస్తోంది. ఉదయం 10గంటలు దాటితే సుర్రుమంటోంది. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడుతున్నా ఉక్కపోతతో ప్రజలు రాత్రంతా ఇబ్బందిపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆరురోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసినా అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. మరో మూడురోజులపాటు ఎండల తీవ్రత ఉండే అవకాశముందని వాతావరణశాఖ సూచనలు జారీ చేస్తోంది.
జ్వరాలబారిన జనం
జిల్లా వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ వాతావరణ ప్రభావంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, ఉక్కపోత కారణంగా చర్మవ్యాధులు, జ్వరం, జలుబు, గొంతునొప్పి తదితర వ్యాధులు ప్రబలుతున్నాయి. పలు గ్రామాల్లో పారిశుధ్య లోపంతో వైరల్ జ్వరాలు వ్యాపించడంతో బాధితులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఆకాశంవైపు ఆశగా..
కార్తెలన్నీ కరిగిపోతున్నాయే తప్ప వర్షాలు మాత్రం కురవడంలేదు. రోజూ ఆకాశంలో కమ్ముకుంటున్న మేఘాలు వర్షించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ఆరంభంలో మురిపించిన వరుణుడు అనంతరం ముఖం చాటేయడంతో జిల్లాలో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరలేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 389.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 373.7 మిల్లీమీటర్లు నమోదైంది. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బావులు, బోర్లపై ఆధారపడిన రైతులు పొలాలను దున్ని వరినాట్లేస్తున్నారు. వర్షాలు కురవకపోతే బావులు, బోర్లు కూడా ఎండిపోతాయేమోనని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులోనైనా వర్షాలు కురుస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
వేసవిని తలపిస్తున్న ఎండలు
ఆగస్టు పైనే రైతుల ఆశలు