
అంతర్‌జిల్లా దొంగ అరెస్ట్
కరీంనగర్‌క్రైం: కమిషనరేట్ పరిధిలోని వివిధప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన అంతర్‌జిల్లా దొంగతో పాటు అతడి వద్ద నగలు కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన టేకు చిరంజీవి ప్రస్తుతం ఆర్మూర్‌లో నివాసముంటున్నాడు. హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటుపడ్డాడు. కరీంనగర్ జిల్లాలోని రామడుగు, మానకొండూర్, ఎల్‌ఎండీ, చిగురుమామిడి, గన్నేరువరం, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల పరిధిలోని దొంగతనాలకు పాల్పడ్డాడు. కేవలం 2 నెలల వ్యవధిలోనే 19 తులాల బంగారం, 164 తులాల వెండి, రూ.1 లక్ష నగదు చోరీ చేశాడు. తాళం వేసిన ఇళ్లను ముందస్తుగా గుర్తించి అక్కడే ఉండి గూగుల్ లొకేషన్ ద్వారా ప్రదేశాన్ని గుర్తుపెట్టుకొని రాత్రి అదే ఇళ్లలోకి ప్రవేశించి నగలు, సొత్తు దొంగిలించేవాడు. తిమ్మాపూర్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా చిరంజీవి పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు విచారించగా దొంగతనం చేసిన సొత్తును నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో బంగారు నరసయ్యకు విక్రయించాడు. దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు. ఇటీవల నిందితుడు చిరంజీవి భార్యకు కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీ కాగా ఈ ప్రాంతంలో తిరిగి దొంగతనాలకు ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీసీఎస్ ఏసీపీ నర్సింహులు, సీఐలు సదన్‌కుమార్, ప్రకాశ్, ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్, క్రైం పార్టీ కానిస్టేబుళ్లు నరేశ్, జైపాల్, రాజశేఖర్, వేణుగోపాల్, అనిల్ అవినాష్‌ను సీపీ అభినందించారు.
19 తులాల బంగారం, 164 తులాల వెండి, నగదు స్వాధీనం
చోరీ సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తి సైతం అరెస్ట్
వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం