
కాశీ సమీపంలో చల్‌గల్ వాసి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: నాలుగు రోజుల క్రితం కనిపించకుండాపోయిన జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్ మల్యాల మోహన్ (65) ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కాశీ సమీపంలోని మీర్జాపూర్ బ్రిడ్జి వద్ద పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో కనిపించాడని, స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి పోలీసులు.. జగిత్యాల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. చల్‌గల్‌కు చెందిన మోహన్ గతనెల 31న ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. కాశీ సమీపంలోని మీర్జాపూర్ వద్ద క్రిమిసంహారక మందుతాగి అపస్మారక స్థితిలో ఉండగా.. అక్కడి స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేదుకు ఉత్తర్‌ప్రదేశ్‌కు బయల్దేరి వెళ్లారు. మోహన్‌కు భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఉరేసుకుని వ్యాపారి..
మల్యాల: వ్యాపారంలో నష్టం రావడంతో మల్యాలకు చెందిన ముకుందు ఆదిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆదిరెడ్డి(59) లారీ బిజినెస్ చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సోమవారం వేకువజామున భార్య నిద్ర లేచి చూసి, జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి
ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోట గ్రామానికి చెందిన గీతకార్మికుడు కోట లింగయ్య(55) తాటిచెట్టు పైనుంచిపడి మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. లింగయ్య రోజూమాదిరిగానే సోమవారం ఉదయం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కిందకు పడిపోయాడు. సమీపంలోని ఓ రైతు చూసి వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. వారువచ్చి కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
జగిత్యాలక్రైం: జగిత్యాల శివారు లింగంపేట శివాజీ చౌరస్తా వద్ద గర్వందుల శ్రీహరి (55) ద్విచక్రవాహనం అదుపుతప్పి కంకర కుప్పకు ఢీకొని మృతిచెందారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంకు చెందిన శ్రీహరి ఆదివారం తన భార్య రమతో కలిసి జగిత్యాలలో ఓ వివాహానికి హాజరయ్యారు. రమను జగిత్యాలలోనే ఉంచి రాత్రి 11 గంటల సమయంలో అంతర్గాం బయల్దేరాడు. శివాజీ చౌరస్తా వద్ద రోడ్డు పక్కనున్న కంకరకుప్పను ఢీకొని తలకు బలమైన గాయాలవడంతో మృతిచెందాడు. రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు.

కాశీ సమీపంలో చల్‌గల్ వాసి ఆత్మహత్య

కాశీ సమీపంలో చల్‌గల్ వాసి ఆత్మహత్య