
అప్పు చెల్లించడం లేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హుజూరాబాద్: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో ఇచ్చిన వ్యక్తి మనోవేదనకు గురై ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్ పట్టణానికి చెందిన పంజాల కృష్ణ, హోటల్ వ్యాపారి వనం హరీశ్‌కు రూ.25లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు తీసుకుని ఏడాదైనా హరీశ్ చెల్లించలేదు. తాను వేరేవారి వద్ద అప్పు తెచ్చానని, ఇబ్బందిపెడుతున్నారని, అప్పు చెల్లించాలని కృష్ణ హోటల్ వద్దకు వెళ్లి హరీశ్‌ను కోరగా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ వద్ద గడ్డిమందు తాగాడు. స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. హరీశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఆత్మహత్యాయత్నానికి ముందు కృష్ణ సెల్ఫీ వీడియో సైతం తీశారు.