
నా దారి.. అడ్డదారి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఆయనో ప్రముఖ వైద్యుడు.. ఆయన కన్ను విలువైన రోడ్డుపై పడింది. తాను కొనుగోలు చేశానంటూ పక్కనున్న స్థలంతో పాటు, ఏకంగా 50 ఫీట్ల రోడ్డును ఆక్రమించడం వివాదాస్పదమైంది. ఇటీవల రోడ్డుకు అడ్డుగా గేట్ పెట్టేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నా, రోడ్డు ఆక్రమణ ప్రయత్నాలను బల్దియా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నగరంలోని అంబేడ్కర్‌నగర్‌లో 50 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురవుతోంది. ఆదర్శనగర్ బోర్డు ఎదురుగా కరీంనగర్–మంచిర్యాల మేయిన్‌రోడ్ నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్, శ్మశానవాటిక వైపు వెళ్లే ఈ రోడ్డు స్థలం తనదేనంటూ తాజాగా ఓ వైద్యుడు రంగప్రవేశం చేశారు. పక్కనే ఉన్న స్థలంతో పాటు రోడ్డు స్థలం కూడా తనదేనంటూ వారం రోజుల క్రితం రోడ్డుకు అడ్డుగా గేట్ పెట్టేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవడం, పోలీసులు రావడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. కాగా ఏఎంసీకి, దళితుల శ్మశానవాటికకు వెళ్లే ఈ 50 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్‌లోనూ ఉంది. అయితే గతంలో రద్దు బదులు (భూమికి బదులు మరో చోట భూమి) కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిని తనకు విక్రయించారని, అది తాను కొనుగోలు చేశానంటూ సదరు వైద్యుడు ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ రద్దు బదులు కింద ఇచ్చిన భూమి అయినా మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న 50 ఫీట్ల రోడ్‌ను ఎలా కేటాయిస్తారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పక్కనున్న స్థలం ఎవరిదనేది రెవెన్యూ అధికారులకు వదిలేస్తే, 50 ఫీట్ల రోడ్డును కాపాడాల్సిన నగరపాలకసంస్థ అధికారులు మిన్నకుండడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కబ్జా నుంచి రోడ్డును కాపాడాలి
అంబేడ్కర్‌నగర్‌లో కబ్జాకు గురవుతున్న స్థలంతో పాటు, 50 ఫీట్ల రోడ్డును కాపాడాలని మాజీ కా ర్పొరేటర్ కుర్ర తిరుపతి, సామాజిక కార్యకర్త మ హమ్మద్ అమీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సో మవారం నగరపాలకసంస్థ అధికారులకు ఫిర్యా దు చేశారు. సర్వే నంబర్ 53లో శ్మశానవాటికకు సంబంధించిన ఎకరానికి పైగా స్థలం కబ్జాకు గురవుతుందని, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న రోడ్డును కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
అంబేడ్కర్ నగర్‌లో రోడ్డు కబ్జా
ఓ ప్రముఖ వైద్యుడి నిర్వాకం
స్థానికుల అభ్యంతరంతో నిలిచిన పనులు

నా దారి.. అడ్డదారి