
పైప్‌లైన్ పనులు వేగవంతం చేయండి
● బల్దియా కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: అమృత్–2లో భాగంగా నగరంలో చేపట్టిన పైప్‌లైన్ పనులు వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. సోమవారం నగరపాలక, ప్రజారోగ్యశాఖ, మిషన్‌భగీరథ అధికారులతో కలిసి ఫిల్టర్‌బెడ్‌ను సందర్శించారు. మోటారు పంపుల పనితీరును పరిశీలించారు. నీటి శుద్ధీకరణ ల్యాబ్‌ను తనిఖీ చేసి, నీటి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైప్‌లైన్‌లను పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తూ వివరాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. కొత్తగా విలీనమైన గ్రామాలు అమృత్–2లో లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. బొమ్మకల్‌లో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటిని శుద్ధి చేసి, నాణ్యతలో పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈలు లచ్చిరెడ్డి, దేవేందర్, పబ్లిక్ హెల్త్ డీఈ సంపత్‌రావు, భగీరథ ఈఈ రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
9 వేల ట్రేడ్ లైసెన్స్‌లు పూర్తి చేయాలి
నగరంలో 9వేల ట్రేడ్ లైసెన్స్‌లను నెలరోజుల్లో పూ ర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. సోమవారం కళాభారతిలో రెవెన్యూ, శానిటేషన్, వార్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నివాసాలను వాణిజ్యానికి వినియోగిస్తే వాటిని కమర్షియల్‌కు మార్చాలని సూచించారు. డివిజన్ వారీగా వార్డు ఆఫీసర్లు రిజిస్టర్ పాటించాలన్నారు. చెత్త పాయింట్ల వద్ద చెత్త కనబడకుండా శుభ్రపరచాలని, ఒక్క స్వచ్ఛ ఆటో చెత్త సేకరణ చేయకపోయినా చర్యలు తప్పవన్నారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాధర్ మోహియోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.