
బీసీ బిల్లు ఆమోదింపజేస్తాం
● బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ కార్పొరేషన్: బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ఢిల్లీలో 5,6,7 తేదీల్లో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని మంకమ్మతోట పొన్నం కాంప్లెక్ష్‌లో నూతనంగా నిర్మించిన మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించి, కుటుంబసభ్యులతో కలిసి పూజాకార్యాక్రమాలు నిర్వహించారు. అనంతరం భగత్‌నగర్‌లోని అయ్యప్ప ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమం ఎలా చేశామో, అలానే బీసీ రిజర్వేషన్ సాధనకు ఉద్యమించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాసేవకు క్యాంప్ కార్యాలయం...
ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, సేవలందించేందుకు క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికగా ప్రారంభించిన కార్యాలయాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, పడాల రాహుల్, యాగండ్ల అనిల్, గడ్డం విలాస్‌రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, వైద్యుల అంజన్‌కుమార్, పులి ఆంజనేయిలుగౌడ్, కర్ర సత్యప్రసన్నరెడ్డి, మడుపు మోహన్, మల్యాల సుజిత్‌కుమార్, చాడగొండ బుచ్చిరెడ్డి, కట్ల సతీశ్, పడిశెట్టి భూమయ్య, ఆకుల ప్రకాష్, ఎండీ తాజ్, ఎస్‌ఏ మోసిన్ తదితరులు పాల్గొన్నారు.