
స్నేహబంధానికి సార్థకత
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గాజెంగి శ్రీధర్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఈనేపథ్యంలో 1994–95లో తమతో ఆడుతూ పాడుతూ పదో తరగతి చదివి స్నేహబంధాన్ని పెంచుకున్న శ్రీధర్ చనిపోవడంతో అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు కదిలారు స్నేహితులు. ఎవరికి తోచిన రీతిలో వారు డబ్బులు సమకూర్చారు. రూ.లక్ష పోగుచేసి శ్రీధర్ కూతురు పేరిట ఫిక్స్ డిపాజిట్ చేసి అందించారు. స్నేహితుని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆ సమయంలో అందరినీ కలుపుకుని డబ్బులు సమకూర్చడంతో పోతుగంటి శ్రీనివాస్, ఆనంద్, ప్రసాద్ తదితరులు ముందుకు కదిలి స్నేహబంధానికి సార్థకత చేకూర్చారు. ఇలాగే నాలుగేళ్ల క్రితం మరో స్నేహితుడు వాసం విద్యాసాగర్ అనార్యోగంతో చనిపోగా అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు వీరే ముందుకు కదిలి రూ.1.60 లక్షల ఆర్థికసాయం అందించారు.
నలభై ఏళ్లుగా..
వెల్గటూర్(ధర్మపురి): వెల్గ టూర్ మండల కేంద్రానికి చెందిన పరకాల రమేశ్, సిరిపురం సత్యనారాయణలు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతితో చదువు మానేసి మండల కేంద్రంలోని టైలరింగ్ షాపులో పని నేర్చుకున్నారు. పనిలో ప్రావీణ్యం సంపాదించాక 22 ఏళ్ల క్రితం 2003లో లక్కీ టైలర్ పేరుతో షాపు ప్రారంభించారు. అనంతరం దినదినాభివృద్ధి చెంది లక్కీ ఫ్యాషన్స్‌గా మారింది. ఇప్పుడు ఇద్దరు స్నేహితులతో పాటు వారి కుటుంబాలు, పిల్లలు కూడా మంచి స్నేహితులుగా మారారు. భవిష్యత్‌లో కూడా ఎలాంటి అరమరికలు లేకుండా కలిసే ఉంటామని పేర్కొన్నారు.
రక్తదాన స్నేహితుడు
బోయినపల్లి(చొప్పదండి): ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశాక.. వారి కళ్లలో తొణికిసలాడే ఆనందం చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని చెబుతాడు బోయినపల్లి మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన పెరుక మహేశ్. రక్తం పంచుకుని పుట్టినవారే.. రక్తదానం చేసే సందర్భం వస్తే తప్పించుకు తిరుగుతున్న రోజులివి. కానీ, ఏ సంబంధం లేకుండా పలువురికి రక్తదానం చేస్తూ స్నేహానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నాడు మహేశ్. ఇప్పటికి 28 సార్లు, ఇందులో స్నేహితులకు కూడా రక్తదానం చేసినట్లు మహేశ్ తెలిపాడు.

స్నేహబంధానికి సార్థకత

స్నేహబంధానికి సార్థకత