
బీజేపీలో సొంత నిర్ణయాలుండవు
చొప్పదండి: బీజేపీలో సొంత నిర్ణయాలుండవని, పదవుల కోసం పాకులాడబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తామని, పత్రికల్లో తప్పుడు వార్తలు రాయొద్దని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాదిరిగా బీజేపీని చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించగా, చొప్పదండిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం మోడీ కానుక కార్యక్రమంలో భాగంగా చొప్పదండి, రామడుగు మండలాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను రారాజు చేయడమే మోడీ లక్ష్యమన్నారు. 11 ఏళ్లలో రూ.71లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదన్నారు. పదోతరగతి బాగా చదివిన విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఒక లక్షా 81 వేల 305 మంది రైతుల ఖాతాల్లో రూ.36.26 కోట్లకు పైగా నిధులు జమయ్యాయని తెలిపారు. చొప్పదండి మండలంలో 4,612 మంది రైతుల అకౌంట్లలో 92.24 లక్షలు జమ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ కేంద్ర మంత్రి గొప్ప సంకల్పంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. 20వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, కేవీకే శాస్త్రవేత్తలు, మండల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రైతును రాజు చేయడమే మోడీ ప్రభుత్వ లక్ష్యం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
చొప్పదండిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ