
చేతులెత్తి మొక్కుతున్నా.. నీళ్లిచ్చి పర్యటించండి
● లేదంటే రైతులతో కలిసి మంత్రులను అడ్డుకుంటాం ● చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కొత్తపల్లి(కరీంనగర్): ‘చెరువులు, కుంటలు, వాగులు వంకలు, ప్రాజెక్టులు అడుగంటి ఎడారిని తలపిస్తున్నాయి. రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. చేతులెత్తి మొక్కుతున్న గోదావరి జలాలు లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోండి’ అంటూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. లేదంటే రైతులతో కలిసి మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ సీతారాంపూర్‌లోని ఓ హోటల్‌లో శనివారం మాట్లాడుతూ.. ఏ ముఖం పెట్టుకొని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా నీటిని అందించే అవకాశం ఉన్నా.. పట్టించుకోకుండా ఉత్తర తెలంగాణను ఎడారి ప్రాంతంగా మార్చుతున్నారన్నారు. కాళేశ్వరం నీళ్లను మిడ్‌మానేరుకు తరలించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే నీటిని విడుదల చేశాకే మంత్రులు జిల్లాలో పర్యటించాలని, లేకుంటే మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, ఎల్‌ఎండీ, కడెం, నారాయణపూర్ రిజర్వాయర్ల ద్వారా నీరందించే మార్గాలు చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్‌గౌడ్, నాయకులు నారాయణరావు, జితేందర్‌రెడ్డి, గంగాధర్, విజయేందర్ రెడ్డి, సురేందర్, నజీర్, అఖిల్, చుక్కా శ్రీనివాస్, రమేశ్, మల్లేశ్, మల్లయ్య, శంకర్ పాల్గొన్నారు.