
గంగాధరలో తగ్గిన రిజిస్ట్రేషన్లు
గంగాధర: గంగాధర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. గతంలో రోజుకు ముప్పై నుంచి 40కి మించి రిజిస్ట్రేషన్లు జరగగా.. ప్రస్తుతం క్రయ,విక్రయదారులు రాక వెలవెలబోతుంది. వారం రోజులుగా రెండు, మూడుకు మించి డాక్యుమెంట్లు కావడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాలకు చెందిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కొత్తపల్లి మండలంలో కరీంనగర్ జిల్లా శివారులోని రేకుర్తి, ఆరెపల్లి, సీతీరాంపూర్, మల్కాపూర్ గ్రామాలతో పాటు కొత్తపల్లి గ్రామం ఉండటంతో ప్రతి రోజు ముప్పైకి మించి డాక్యుమెంట్లు నమోదవుతుండేవి. అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు, సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కావడం, ఇంటి నంబర్‌తో రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి ఖచ్చితమైన నిబంధనలు అమలు చేయడంతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. కొత్తపల్లి, రేకుర్తి రెవెన్యూ పరిధిలోని భూముల్లో సమస్యలు ఎదురవుతుండడంతో కొనుగోలుదారులు ముందుకు రావడంలేదు. సంబంధిత భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారులు మొగ్గు చూపడం లేదు.