
యాంత్రీకరణకు మహర్దశ
ఈ సారైన రైతులకు చేరేనా..!
ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయాలి. గత మార్చి నెల 17వ తేదీన నిధులు కేటాయించగా అంతే వేగంగా వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 25వరకు దరఖాస్తులు తీసుకోగా వచ్చిన వాటిని ఆన్‌లైన్ చేసి ప్రక్రియకు సిద్ధం చేయగా అంతలోనే ఆర్థిక సంవత్సరం ముగిసింది. దీంతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి. అయితే 1990 నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కొనసాగుతోంది. 2014వరకు యాంత్రీకరణ పథకానికి నిధులు రాగా అప్పటి నుంచి నిధుల కేటాయింపు లేదు. ఈ క్రమంలో గత మార్చి నెలలో యాంత్రీకరణ పథకాన్ని తెరపైకి తేగా 2024–25 సంవత్సరానికి గానూ కరీంనగర్ జిల్లాకు రూ.73లక్షలు కేటాయించింది. కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరిస్తాయి. ఈ పథకానికి మహిళా రైతులు మాత్రమే అర్హులు కాగా గతంలో పురుషులకే ఇచ్చేవారు. ఇదిలా ఉండగా 50శాతం రాయితీతో పరికరాలు ఇస్తుండటం, దాదాపు దశాబ్దం తరువాత అవకాశం రావడంతో దరఖాస్తులు 5వేల వరకు వచ్చాయని సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో తక్కువ నిధులు కేటాయించగా ఈ సారి రెట్టింపు నిధులు కేటాయించడం శుభ పరిణామం.
కరీంనగర్ అర్బన్: దశాబ్దానికి పైగా దూరమైన వ్యవసాయ యాంత్రీకరణ పథకం మళ్లీ చేరువవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే రైతులకు రాయితీ పరికరాలు చేరాల్సి ఉండగా సదరు సంవత్సర ముగింపు నెలలో నిధులు కేటాయించడం, అంతలోనే మార్చి ముగియడంతో పథకం నిలిచిపోయింది. తాజాగా మళ్లీ నిధులను కేటాయించగా దరఖాస్తుల స్వీకరణకు జిల్లా వ్యవసాయశాఖ చర్యలు చేపడుతోంది. ఈ నెల 5నుంచి 15 వరకు దరఖాస్తులను స్వీకరించనుండగా ఆయా దశల వారీగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాకు 10.4కోట్లు కేటాయించారు.
ఉమ్మడి జిల్లాకు రూ.10.4కోట్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025–26 సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు రూ. 10.4 కోట్ల నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళా రైతులకు 50 శాతం రాయితీ, జనరల్ కేటగిరీ రైతులకు 40శాతం రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి యాసంగి వరకు పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఈ సారి 15 రకాల యంత్ర పరికరాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేస్తున్నారు.
మళ్లీ దరఖాస్తుల స్వీకరణ
ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పథకం అమలుకు సంబంధించి ఆగస్టు 5నుంచి 15వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో చేసిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వచ్చిన దరఖాస్తులను వ్యవసాయాధికారులు 16వ తేదీన జిల్లా కలెక్టర్‌కు అందజేస్తారు. 20 వరకు వాటిని పరిశీలిస్తారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను తెలియజేస్తారు. ఎంపికై న రైతులకు ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 5వరకు మంజూరు పత్రాలు, సెప్టెంబరు 7 నుంచి 17 వరకు పరికరాలు పంపిణీ చేస్తారు.