
కుళ్లిన మాంసం.. నాణ్యత లేని సామగ్రి
● వేములవాడలో రెస్టారెంట్ సీజ్ ● సిరిసిల్లలో నోటీస్‌లు ● రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
సిరిసిల్ల: వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లోని రెస్టారెంట్లలో శుక్రవారం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. వేములవాడలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని తాజ్ రెస్టారెంట్‌ను సీజ్ చేసి, రూ.30 వేల జరిమానా విధించారు. సిరిసిల్లలో రుచి హోటల్‌లో అపరిశుభ్రతను గుర్తించి నోటీసులు జారీచేశారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ డాక్టర్ శివలీల ఆదేశాల మేరకు జిల్లాలో అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వేములవాడ రెస్టారెంట్‌లో అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం, నిలువ చేసిన మాంసం దుర్వాసన రావడం, హానికర రసాయనాలతో ఉన్న కృత్రిమ రంగులను గుర్తించారు. రూ.20,500 విలువైన 70 కిలోల మాంసం నిల్వ ఉన్నట్లు తేలింది. రెస్టారెంట్‌ను సీజ్ చేసి, రూ.30వేల జరిమానా విధించారు. జిల్లా కేంద్రంలోని రుచి రెస్టారెంట్‌లోనూ అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం, ఫుడ్ హ్యాండ్‌లెట్స్ గ్లౌస్, హెయిర్ క్యాప్స్ ధరించకపోవడం, వండిన ఆహారంపై మూతలు కప్పకపోవడం, కుళ్లిన వస్తువులను గుర్తించిన అధికారులు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అనుమానిత ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, టాస్క్‌ఫోర్స్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌లు రోహిత్‌రెడ్డి, శ్రీషిక, స్వాతి, అంకిత్‌రెడ్డి పాల్గొన్నారు.