
పెద్దపల్లి కలెక్టర్‌దే
ఎఫ్‌ఆర్‌ఎస్ ఘనత
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పాలనాపగ్గాలు చేపట్టిన కోయ శ్రీహర్ష.. విద్య, వైద్యశాఖలను గాడిన పెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నిత్యం తన పర్యటన ఏ మండలం.. గ్రామంలో ఉన్నా అందుబాటులో ఉన్న పాఠశాల, వైద్యశాలలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై సమస్యలు, అందుతున్న సేవలపై ఆరా తీస్తారు. ఈ క్రమంలో పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా సమయపాలన పాటించేలా ఏం చేయాలా.. అని ఆలోచించారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి జిల్లాలో ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం) పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు 2024 సెప్టెంబర్‌లో అనుమతి పొంది అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖలో పనిచేసే మల్లేశంను కోఆర్డినేటర్‌గా నియమించి పూర్తి బాధ్యతలు అప్పగించారు. 11 నెలల కాలంలో 85 నుంచి 95శాతం సమయపాలన సాధించగలిగారు.
● గూగుల్ షీట్ నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ వరకు..
విద్యాశాఖలో పనిచేసే నాన్‌టీచింగ్ అధికారులు, ఉద్యోగులు మొదలు స్కూళ్లలో పాఠాలు చెప్పే పంతుళ్ల వరకు వివరాలను ఆన్‌లైన్‌లో గూగుల్ షీట్ ద్వారా నమోదు చేశారు. దానిని ఆధునిక సాంకేతికతతో 2024 అక్టోబర్‌లో గూగుల్ ఫారంకు మార్చారు. అందులోనూ పూర్తిస్థాయి ఫలితం కనిపించకపోవడంతో గతేడాది డిసెంబర్ 3 నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఈ పద్ధతిని అమలు చేయవద్దంటూ పలు ఉపాధ్యాయసంఘాలు, ఉపాధ్యాయులు కొంతమేర ఒత్తిడి తెచ్చినా, సమయస్ఫూర్తిగా వారిని ఒప్పించి ముందుకు సాగించారని అధికారవర్గాలు తెలిపాయి.
● ఆన్‌డ్యూటీలో లేకుంటే ఆబ్సెంటే..
పాఠశాలకు ఉపాధ్యాయుడు, ఆఫీసుకు ఉద్యోగులు ఏ సమయంలో వచ్చారో ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా నమోదు చేయాలి. ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చినపుడు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో లాగిన్ అయి, బయటకు వెళ్లేటప్పుడు లాగౌట్ కావాలి. ఒక వేళ అత్యవసరంగా సదరు ఉపాధ్యాయుడు బయటకు వెళ్లాల్సి వస్తే ఆన్‌లైన్‌లోనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి అనుమతి పొందాలి. ఉపాధ్యాయుడు చూపిన కారణం సమంజసం కాదని హెచ్‌ఎం భావిస్తే ఉపాధ్యాయుడి రిక్వెస్ట్‌ను తిరస్కరించేలా అవకాశం కల్పించారు. ఇలా 22 రకాలతో కూడిన సెలవులను అందులో పొందుపర్చారు.
● నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు
పెద్దపల్లి జిల్లా విద్యాశాఖలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం విజయవంతం కావడంతో ఆగస్టు 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం పెద్దపల్లి జిల్లాలో కార్యక్రమ కోఆర్డినేటర్‌గా వ్యవహరించిన మల్లేశ్ రాష్ట్రంలోని మిగతా 32 జిల్లాలకు చెందిన విద్యాశాఖ అధికారులు, ఇతర సిబ్బందికి గురువారం జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన కల్పించారు.
పెద్దపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు ప్రభుత్వ అనుమతి
85 నుంచి 95 శాతం సమయపాలన సాధింపు
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వ నిర్ణయం