
రైతులు జర భద్రం
గంభీరావుపేట(సిరిసిల్ల): వర్షాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. పాములు అంటేనే భయపడతాం. వానాకాలంలో వర్షాలతో భూమి తడవడంతో పాములు తమ రక్షణ కోసం పొడి వాతావరణం కోసం బయటకు వస్తాయి. ఈ క్రమంలో చేనులు, పొలాల గట్టు, ఇళ్లలోకి చేరుతుంటాయి. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పాము కాటుకు గురికాక తప్పదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. వర్షాలు జోరందుకున్నాయి. సెప్టెంబర్ వరకు పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాములు ఎలుకలు, కప్పలను తినేందుకు బయట తిరుగుతూ చెట్ల పొదల్లో ఉంటాయి. వానాకాలం సాగు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలను దున్నడం, పొలాలకు నీరు పెట్టడంతో భూములు బురదమయంగా మారుతాయి. దీంతో పొడి భూమిలోకి చేరేందుకు బయటకు వస్తాయి. ఈ క్రమంలోనే ఇళ్లలోకి చేరడం, రైతులు తొలగించిన గడ్డి, పిచ్చి మొక్కల్లో ఉంటూ ఆహారం కోసం అన్వేషణ కొనసాగిస్తాయి. రైతులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వాటిపై కాలు వేస్తే కాటు వేసే అవకాశం ఉంది.
పాముకాటుతో జాగ్రత్త..
కప్పలు, ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ఎక్కువగా పాములు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాము కాటేస్తే ఒంటిపై రెండు లేదా నాలుగు కామా ఆకారపు గుర్తులు పడుతాయి. అరగంటలోపు విషం ఒళ్లంతా పాకి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కళ్లు మూతలు పడడం, చేతులు, కాళ్లు తాత్కాలికంగా పక్షవాతం రావడం, మాట ఆగిపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని పాములు ఉదాహరణకు రక్తపంజర పాము కరిస్తే కరిచిన భాగం ఉబ్బి తీవ్రంగా నొప్పి కలిగిస్తుంది. అరగంటలో నోరు, చెవులో నుంచి రక్తస్రావం జరుగుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రైతులు పంట చేలకు వెళ్లినప్పుడు పాదరక్షలు వేసుకోవాలి. రాత్రి, తెల్లవారుజామున పొలాలకు వెళ్లేటప్పుడు టార్చిలైట్ వెంట ఉండాలి. పశుగ్రాసం, చెత్త కుప్పులు, కట్టెలు, రాళ్ల కుప్పలు వంటి ఉన్నచోట సర్పాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేతిలో కర్ర పట్టుకొని శబ్దాలు చేసుకుంటూ కర్రతో అటు ఇటు కదుపుతూ ముందుకెళ్లాలి. మోటార్ స్టార్టర్ డబ్బాల్లోనూ పాములు సేద తీరుతుంటాయి. వాటి తలుపులు తీసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడితో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. పాముకాటు వేయగానే గాయాల పైభాగంలో కట్టు కట్టాలి. దీంతో విషం శరీరానికి వెళ్లకుండా నివారించవచ్చు. విషానికి విరుగుడుగా యాంటీ వినమ్ ఇంజక్షన్ తీసుకొని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
వానాకాలంలో పాములతో ప్రాణాపాయం
ఏమరపాటుగా ఉంటే ముప్పే
అప్రమత్తత అవసరం
అందుబాటులో మందులు
మండలంలోని లింగన్నపేట పీహెచ్‌సీ పరిధిలో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వ్యక్తులు భయం, కంగారు పడొద్దు. వెంటనే ఆలస్యం చేయకుండా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తొందరగా ఇంజక్షన్ వేయిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
– వేణుగోపాల్‌రెడ్డి,
పీహెచ్‌సీ వైద్యుడు, లింగన్నపేట

రైతులు జర భద్రం

రైతులు జర భద్రం